న్యూఢిల్లీ: పాకిస్థాన్‌లోని ఉగ్ర స్థావరాలను పేల్చేందుకు భారత సైన్యం ఆపరేషన్ సింధూర్(Operation Sindoor) చేపట్టిన విషయం తెలిసిందే. అయితే ఆ సమయంలో అనేక అవరోధాలు ఎదురయ్యాయి. ఆ ఆపరేషన్ ఎన్నో పాఠాలు నేర్పినట్లు డిప్యూటీ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్, లెఫ్టినెంట్ జనరల్ రాహుల్ ఆర్ సింగ్ తెలిపారు. ఎఫ్ఐసీసీఐ నిర్వహించిన న్యూ ఏజ్ మిలిటరీ టెక్నాలజీస్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ఆధునిక యుద్ధ శైలి గురించి ఆపరేషన్ సిందూర్ బయటపెట్టిందన్నారు. సైనిక చర్యల వేళ .. వాయు రక్షణ వ్యవస్థ, సాంకేతిక ఆధునీకరణ.. కీలకమైన అంశాలని ఆయన తెలిపారు.
పాకిస్థాన్-చైనా మధ్య కూటమి ప్రమాదకరంగా మారినట్లు ఆర్మీ డిప్యూటీ చీఫ్ వెల్లడించారు. పాకిస్థాన్‌తో బోర్డర్ విషయంలో రెండు సమస్యలు ఉన్నట్లు ఆయన చెప్పారు. పాకిస్థాన్ ముందు ఉండగా, దాని వెనుక చైనా ఆ దేశానికి సపోర్టు ఇస్తున్నట్లు చెప్పారు. పాకిస్థాన్ వద్ద ఉన్న మిలిటరీ దళంలో .. సుమారు 81 శాతం చైనా హార్డ్‌వేర్ ఆయుధాలు ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో ఎయిర్ డిఫెన్స్ కీలకంగా మారిందని, ఆ ఆపరేషన్ కొన్ని పాఠాలు నేర్పిందన్నారు. భారతీయ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌ను చాలా బలోపేతం చేయాల్సి ఉందన్నారు. చైనా సహాయంతో పాకిస్థాన్ మన గురించి లైవ్ అప్డేట్స్ తెలుసుకున్నదని, మన ఆయుధాల అంశాన్ని పాకిస్థాన్‌కు ఎప్పటికప్పుడు చేరవేసిందన్నారు.
ఇతర ఆయుధాలతో పోటీపడేందుకు చైనా తన ఆయుధాలను టెస్ట్ చేసిందని, ఇదొకరకంగా లైవ్ ల్యాబ్‌లా మారిందని, టర్కీ కూడా పాకిస్థాన్‌కు కీలకమైన సపోర్టు ఇచ్చిందని, బైరక్తార్తో పాటు ఎన్నో రకాల డ్రోన్లను అందజేసిందన్నారు. డీజీఎం స్థాయి చర్చలు జరుగుతున్నప్పుడు మన ఆయుధాలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని పాకిస్థాన్‌కు చైనా చేరవేసిందన్నారు. ఈ దశలో మనకు బలమైన వాయు రక్షణ వ్యవస్థ కావాలని లెఫ్టినెంట్ జనరల్ రాహుల్ ఆర్ సింగ్ తెలిపారు. కానీ ఆపరేషన్ సింధూర్ వేళ భారతీయ సైనిక బలగాలు చాలా కచ్చితత్వంతో ఉగ్ర స్థావరాలపై దాడులు చేశాయన్నారు. మానవ మేధస్సు, టెక్నాలజీ మధ్య వ్యూహాత్మక సహకారం ఉండాలన్నారు.
ఆపరేషన్ సింధూర్ కోసం 21 టార్గెట్లను గుర్తించామని, దీంట్లో 9 టార్గెట్లను ఎంచుకున్నామని, ఆపరేషన్ జరిపే చివరి రోజు మాత్రమే ఆ 9 టార్గెట్లను ద్రువీకరించామని పేర్కొన్నారు. త్రివిధ దళాలు ఐక్యంగా ఆపరేషన్‌లో పాల్గొన్నాయని తెలిపారు. సైనిక లక్ష్యం చేరుకున్న తర్వాత.. దాన్ని ఆపాల్సి ఉంటుందని, యుద్ధం ప్రారంభించడం చాలా సులువు అని, కానీ దాన్ని నియంత్రించడం కష్టమైందన్నారు. సరైన సమయంలో యుద్ధాన్ని ఆపి మాస్టర్ స్ట్రోక్ ఇచ్చామని పేర్కొన్నారు.