న్యూఢిల్లీ: టిబెట్‌కు చెందిన ఆధ్యాత్మిక బౌద్ధ మత గురువు దలైలామా(Dalai Lama) ఆదివారం 90వ పుట్టిన రోజు జరుపుకున్న విషయం తెలిసిందే. మెక్లియోగంజ్లో ఆ వేడుకలు జరిగాయి. ఈ నేపథ్యంలో దలైలామాకు ప్రధాని మోదీ బర్త్‌డే విషెస్ చెప్పారు. అయితే భారత ప్రధాని స్పందన పట్ల డ్రాగన్ దేశం చైనా అసహనం(China Protest) వ్యక్తం చేసింది. ప్రధాని మోదీ విషస్ను ఖండిస్తూ దౌత్యపరమైన నిరసన వ్యక్తం చేసింది. గడిచిన నాలుగు రోజుల్లో టిబెట్ అంశంపై మూడు సార్లు చైనా తన నిరసన వ్యక్తం చేసింది. చైనా విదేశాంగ ప్రతినిధి మావో నింగ్ ఓ ప్రకటన జారీ చేశారు. జిజాంగ్(టికెట్)తో ఉన్న సున్నితమైన సమస్యల పట్ల భారత్ పూర్తి అవగాహనతో మెలగాలని విదేశాంగ ప్రతినిధి మావో నింగ్ తెలిపారు. దలైలామా చైనా వ్యతిరేకి అని, వేర్పాటువాది అని ఆరోపించారు. భారత్ వ్యవహరించిన తీరు పట్ల తమ నిరసన వ్యక్తం చేసినట్లు మావో వెల్లడించారు.
దలైలామా ఎంపిక అంశంలో సంప్రదాయ విధానం పాటిస్తామని, ఆ వ్యవస్థలో చైనా జోక్యం అవసరం లేదని ప్రస్తుతం గురువు పేర్కొన్న విషయం తెలిసిందే. దలైలామా వ్యాఖ్యలతో చైనా ఆవేశానికి లోనైంది. భారత్ మాత్రం చైనా వైఖరిని కొట్టిపారేసింది. ఎన్నో ఏళ్ల నుంచి దలైలామాకు తాము బర్త్‌డే విషెస్ చెబుతున్నామని ఇండియా పేర్కొన్నది. ఇదేమీ కొత్త కాదు అని తెలిపింది.