న్యూఢిల్లీ, జనవరి 13: ఒకవైపు సరిహద్దులో ఉద్రిక్తతలు తగ్గించేందుకు భారత్తో చర్చలు జరుపుతూనే మరోవైపు సైనిక సామర్థ్యాన్ని ప్రదర్శించేందుకు చైనా తహతహలాడుతున్నది. వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ) వెంట లద్దాఖ్ సమీపంలో చైనా సైనిక సామర్థ్య ప్రదర్శన, కవాతు నిర్వహించిన విషయం వెలుగులోకి వచ్చింది. ఇందులో భాగంగా ఎలాంటి ఉపరితలం పైనైనా నడిచే యుద్ధ వాహనాలు, మానవ రహిత వ్యవస్థలు, డ్రోన్లు వంటి అత్యాధునిక యుద్ధ సాంకేతికతను ప్రదర్శించింది. ముఖ్యంగా ఎత్తయిన, కఠినమైన లద్ధాఖ్ ప్రాంతంలోకి సైనిక రవాణా వ్యవస్థను మెరుగు పరుచుకునే దిశగా ఈ ప్రదర్శన నిర్వహించినట్టు తెలుస్తున్నది.
వాస్తవాధీన రేఖ వద్ద పరిస్థితి సున్నితంగా ఉన్నప్పటికీ స్థిరంగానే ఉందని భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది తెలిపారు. సోమవారం ఢిల్లీలో ఆయన వార్షిక ప్రెస్మీట్ నిర్వహించారు. ఎల్ఏసీ వద్ద భారత సైన్యం మొహరింపులు సమతౌల్యంతో కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. మరోవైపు జమ్ము కశ్మీర్లో పరిస్థితి నియంత్రణలో ఉందన్నారు.