న్యూఢిల్లీ, మార్చి 11: బాలల హక్కుల కార్యకర్త, నోబెల్ అవార్డు గ్రహీత కైలాస్ సత్యార్థి సోమవారం మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో ‘సత్యార్థి మూవ్మెంట్ ఫర్ గ్లోబల్ కంపాషన్’ (ఎస్ఎంజీసీ)ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సత్యార్థి మాట్లాడుతూ దయార్ద్ర చర్చలు, చర్యలతో ప్రపంచాన్ని సంస్కరించవచ్చని పిలుపునిచ్చారు.
నోబెల్ గ్రహీతలు, గ్లోబల్ లీడర్లు, వ్యాపారులు, విద్యా సంస్థలు, యువత అంతా కలిసి పౌరసమాజాన్ని న్యాయమైన సమాజంగా నిర్మించటానికి చొరవ చూపాలన్నారు. దీని వల్ల ప్రపంచంలోని అంతరాలన్నీ తొలగిపోతాయని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రపంచవ్యాప్తంగా కరుణ భూమిక కావాలని తాను దశాబ్దాలుగా వాదిస్తున్నానని, అందులో భాగంగా ఈ రోజు మరో అడుగు ముందుకు పడిందని సత్యార్థి చెప్పారు. ప్రతి ఒక్కరూ తమలోని కారుణ్యాన్ని గుర్తించి ఈ ఉద్యమంలో భాగస్తులు కావాలని కోరారు.