పాట్నా: బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ (Nitish Kumar) వివాదంలో చిక్కుకున్నారు. పాట్నాలో జరిగిన ఓ కార్యక్రమంలో ఓ మహిళా డాక్టర్ హిజాబ్‌ను (Hijab) దించి, ఆమె ముఖాన్ని చూడటంపై విమర్శలు వస్తున్నాయి. ఆయుష్ డాక్టర్లకు సర్టిఫికెట్ల ప్రదానం సందర్భంగా సోమవారం ఈ ఘటన జరిగింది. ఆ సమయంలో ఆయన వెనుక ఉన్న కొందరు నవ్వుతుండటం వినిపించింది. ఉప ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి ఆయనను నిలువరిస్తున్నట్లు ఓ వీడియోలో కనిపించింది.
ఈ ఘటనపై కాంగ్రెస్, ఆర్జేడీ తీవ్రంగా స్పందించాయి. ఆర్జేడీ అధికార ప్రతినిధి ఎజాజ్ అహ్మద్ స్పందిస్తూ, మహిళల పట్ల బీజేపీ-జేడీయూ కూటమి వైఖరి స్పష్టమవుతున్నదన్నారు. ఈ చర్య ఓ వ్యక్తికి గల మత, సంస్కృతిపరమైన స్వేచ్ఛతో జీవించే హక్కును లాక్కోవడమేనని ఆరోపించారు. నితీశ్ రాజీనామా చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. నితీశ్ కుమార్ మానసిక స్థితిని ఆర్జేడీ ప్రశ్నించింది.