న్యూఢిల్లీ: చత్తీస్‌ఘడ్‌లో భారీ లిక్కర్ స్కామ్(Chhattisgarh Liquor Scam) జరిగిన విషయం తెలిసిందే. ఆ కేసులో ఆ రాష్ట్ర మాజీ సీఎం భూపేశ్ భగల్ కుమారుడు చైతన్యకు సుమారు రూ.250 కోట్లు ముట్టినట్లు తెలుస్తోంది. తన వాటా కింద ఆ మొత్తం అందినట్లు అవినీతి నిరోధక శాఖ తన ఛార్జిషీట్లో పేర్కొన్నది. లిక్కర్ స్కామ్‌లో చైతన్య భగేల్ కీలక పాత్ర పోషించినట్లు ఆ ఛార్జీషీట్లో తెలిపారు. బెదిరింపులకు పాల్పడే సిండికేట్ రాకెట్‌కు చైతన్య భగేల్ అండగా నిలిచినట్లు పేర్కొన్నారు. ఎక్సైజ్ శాఖలో ఉన్న కొందరి అండతో వసూళ్లకు పాల్పడినట్లు తెలుస్తోంది. 2018 నుంచి 2023 వరకు లిక్కర్ స్కామ్ జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి.
మద్యం కుంభకోణంపై సుమారు 3800 పేజీల డాక్యమెంట్ను రూపొందించారు. సుమారు 3000 కోట్లకు సంబంధించిన మద్యం కేసులో చైతన్య భగేల్ ప్రధాన నిందితుడిగా భావిస్తున్నారు. ఆ రాష్ట్రానికి చెందిన ఏసీబీ-ఈఓడబ్ల్యూ తన స్టేట్మెంట్లో పేర్కొన్నది. ఈ కేసులో ఇప్పటి వరకు ఎనిమిది సార్లు ఛార్జీషీట్ దాఖలు చేశారు. తాజా ఛార్జీషీట్లో ప్రస్తుతం విచారణ ఏ దశలో ఉన్నదో పేర్కొన్నారు. కస్టడీలో ఉన్న వారి గురించి పూర్తి స్థాయిలో డిజిటల్ ఆధారాలను సేకరించారు. నిందితుల గురించి విచారణ కొనసాగుతున్నట్లు చెప్పారు.
మద్యం సిండికేట్ వ్యాపారులతో చైతన్య భగేల్ ఓ కోఆర్డినేటర్‌గా పనిచేసినట్లు ఛార్జీషీట్లో పేర్కొన్నారు. సిండికేట్ ద్వారా వచ్చిన డబ్బును చైతన్య నమ్మకస్తులతో తరలించినట్లు ఆరోపణలు ఉన్నాయి. వ్యాపారవేత్త అన్వర్ దేబార్ బృందం నిధుల్ని మళ్లించినట్లు ఆరోపణలు ఉన్నాయి. లిక్కర్ వ్యాపారంలో ఉన్న వారి నుంచి చైతన్యకు అనేక రూపాల్లో తన షేర్లు అందినట్లు అధికారులు గుర్తించారు. తన కుటుంబీకులకు చెందిన సంస్థలకు ఆ డబ్బును ట్రాన్స్ఫర్ చేశారు. ఆ సొమ్మును తిరిగి రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులకు వాడారు.