కొత్తగూడెం ప్రగతి మైదాన్, మే 21: ఛత్తీస్‌గఢ్‌లో మరో భీకర ఎన్కౌంటర్ జరిగింది. మావోయిస్టులు, భద్రతా దళాలకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి, పొలిట్ బ్యూరో సభ్యుడు, కేంద్ర మిలిటరీ కమిషన్ సభ్యుడు నంబాల కేశవరావు మృతిచెందారు. ఆయనతోసహా 27 మంది ప్రాణాలు కోల్పోయారు. మావోయిస్టుల కాల్పుల్లో డీఆర్జీ జవాన్‌తోపాటు మరో సభ్యుడు మృతిచెందగా.. మరికొందరు జవాన్లు గాయపడ్డారు. ఈ ఎన్కౌంటర్ ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం నారాయణ్‌పూర్-దంతేవాడ-బీజాపూర్ జిల్లాల సరిహద్దుల్లో బుధవారం చోటు చేసుకున్నది.
మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తున్నది. నారాయణ్‌పూర్-దంతేవాడ-బీజాపూర్ జిల్లాల సరిహద్దు మాడ్ ఏరియాలోని అబూజ్మాడ్ అడవుల్లో మావోయిస్టు పార్టీకి చెందిన అగ్రనేతలు ఉన్నట్టు పోలీస్ అధికారులకు విశ్వసనీయ సమాచారం అందింది. దీంతో మూడు జిల్లాలకు చెందిన సుమారు 500 మంది డీఆర్జీ సాయుధ బలగాలు మంగళవారం నుంచి సంయుక్తంగా సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి. ఈ క్రమంలో బుధవారం ఉదయం మావోయిస్టులు తారసపడి జవాన్లపైకి కాల్పుల జరిపారు. వెంటనే అప్రమత్తమైన సాయుధ బలగాలు ఎదురు కాల్పులకు దిగాయి.
ఇరువర్గాల మధ్య సుమారు మూడు గంటలపాటు జరిగిన భీకర పోరులో జవాన్ల ధాటికి తాళలేక మావోయిస్టులు కాల్పులు జరుపుతూనే పారిపోయారు. కాల్పుల విరమణ తర్వాత ఆ ప్రాంతాన్ని తమ అధీనంలోకి తీసుకున్న భద్రతా బలగాలు ఘటనా స్థలం నుంచి 27 మంది మావోయిస్టుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నాయి. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి, పొలిట్ బ్యూరో సభ్యుడు, కేంద్ర మిలిటరీ కమిషన్ సభ్యుడు నంబాల కేశవరావు అలియాస్ గంగన్న అలియాస్ బసవరాజు అలియాస్ బీఆర్ అలియాస్ ప్రకాశ్ అలియాస్ కృష్ణ అలియాస్ విజయ్(70)తోపాటు 27 మంది మావోయిస్టులు మృతిచెందినట్లు తెలుస్తోంది.
అలాగే ‘అవామ్-ఐ-జంగ్’ ఎడిటర్, 31 ఏళ్లుగా అజ్ఞాతంలో ఉన్న నేత, మాడ్ ఏరియా డివిజన్ ప్రెస్ యూనిట్ సభ్యుడు, దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు సజ్జా వెంకట నాగేశ్వరరావు అలియాస్ రాజన్న అలియాస్ యేసన్న అలియాస్ నవీన్ సైతం మృతి చెందినవారిలో ఉన్నారు. డీఆర్జీ జవాన్‌తోపాటు మరో సభ్యుడు మృతిచెందగా.. మరికొందరు జవాన్లు గాయపడ్డట్లు పోలీసు వర్గాలు పేర్కొన్నాయి. 2018లో నంబాల కేశవరావు కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టాక అనేక తీవ్రమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి. అప్పటి నుంచి ఛత్తీస్‌గఢ్ అడవుల్లో వరుస మారణకాండలు జరిగినట్లు చెప్పుకోవచ్చు. కేశవరావు నేతృత్వంలో పీఎల్జీఏ మరింత రెట్టింపు ఉత్సాహంతో పని చేసింది. ప్రస్తుతం బసవరావు మృతితో మావోయిస్టు పార్టీ కార్యకలాపాలకు బ్రేక్ పడ్డట్లేనని భావిస్తున్నారు.
అబూజ్మాడ్ అడవులను కేంద్రంగా చేసుకున్న మావోయిస్టు పార్టీ కార్యకలాపాలకు చెక్ పెట్టేందుకు కేంద్రం వ్యూహాత్మకంగా పావులు కదిపింది. ఇందులో భాగంగానే నెల రోజుల ‘హైడ్రామా’ అనంతరం మావోయిస్టు పార్టీ అగ్ర నాయకత్వంపై పంజా విసిరింది. అబూజ్మాడ్ ఎదురుకాల్పుల్లో ఇప్పటివరకు 27 మంది మావోయిస్టుల మృతదేహాలతోపాటు వారికి సంబంధించిన భారీ ఆయుధ, వస్తు సామగ్రిని భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి. మృతుల్లో ఇంకొందరు ముఖ్య నేతలు ఉన్నట్లుగా తెలుస్తోంది. మిగతా వారి వివరాలను అధికారులు ధ్రువీకరించాల్సి ఉంది. ంబాల కేశవరావుపై ఛత్తీస్‌గఢ్, తెలంగాణతోపాటు పలు రాష్ట్రాల్లో ఇప్పటికే రూ.5 కోట్లకు పైగానే రివార్డు ఉంది. తాజా ఘటనను కూడా కలుపుకుంటే ఛత్తీస్‌గఢ్‌లో ఈ ఏడాది ఇప్పటివరకు జరిగిన వేర్వేరు ఎన్కౌంటర్లలో 200 మంది నక్సలైట్లు మరణించారు. వీరిలో 183 మంది బీజాపూర్, నారాయణ్‌పూర్, దంతేవాడ, కొండగావ్ జిల్లాలతో కూడిన బస్తర్ డివిజన్లో మృతిచెందారు.
ఛత్తీస్‌గఢ్‌లో 27 మంది నక్సలైట్లను అంతం చేసిన మన భద్రతా దళాలను చూసి గర్వపడుతున్నానని ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం తెలిపారు. ఈ గణనీయమైన విజయాన్ని సాధించిన మన భద్రతా దళాల పట్ల గర్విస్తున్నానని ఎక్స్ వేదికగా ఆయన పేర్కొన్నారు. మావోయిజం బెడదను నిర్మూలించాలని తమ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని, ప్రజలకు శాంతి, అభివృద్ధిని అందచేయడమే తమ ధ్యేయమని మోదీ తెలిపారు.
ఛత్తీస్‌గఢ్‌లో బుధవారం భద్రతాదళాల జరిపిన ఎదురుకాల్పులలో మరణించిన 27 మంది నక్సలైట్లలో నక్సల్ ఉద్యమానికి వెన్నెముకగా ఉన్న పీపీఐ-మావోయిస్టు ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు ఉన్నట్లు కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటించారు. నక్సలిజానికి వ్యతిరేకంగా మూడు దశాబ్దాలుగా సాగుతున్న యుద్ధంలో మొట్టమొదటిసారి ప్రధాన కార్యదర్శి ర్యాంకు ఉన్న నాయకుడిని భద్రతా దళాలు అంతం చేశాయని ఎక్స్ వేదికగా షా పేర్కొన్నారు. నక్సలిజాన్ని అంతం చేసేందుకు సాగుతున్న యుద్ధంలో నేడు ఓ చారిత్రక విజయాన్ని సాధించినట్లు ఆయన తెలిపారు. ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణ్‌పూర్‌లో భద్రతా దళాలు జరిపిన ఆపరేషన్‌లో మావోయిస్టు అగ్రనేత, నంబాల కేశవరావుతోసహా 27 మంది నక్సలైట్లు మరణించారని ఆయన పేర్కొన్నారు. ఈ భారీ విజయాన్ని సాధించినందుకు భద్రతా దళాలు, ఏజెన్సీలను ఆయన అభినందించారు. ఆపరేషన్ బ్లాక్ ఫారెస్టు పూర్తయిందని, 54 మంది నక్సలైట్లను అరెస్టు చేయగా 84 మంది నక్సల్స్ ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, మహారాష్ట్రలో లొంగిపోయారని హోం మంత్రి వెల్లడించారు. 2026 మార్చి 31వ తేదీ లోపల నక్సలిజాన్ని అంతం చేయాలన్న సంకల్పంతో మోదీ ప్రభుత్వం ఉందని ఆయన పునరుద్ఘాటించారు.