కొత్తగూడెం ప్రగతి మైదాన్ : ఒక పక్క మావోయిస్టుల లొంగుబాట్లు కొనసాగుతున్నప్పటికీ ఎన్కౌంటర్లు ఆగడం లేదు. దండకారణ్యంలో మళ్లీ తుపాకుల మోత మోగింది. ఛత్తీస్గఢ్లో మావోయిస్టులు, భద్రతా దళాల మధ్య జరిగిన భీకర పోరులో 12 మంది మావోయిస్టులు, ముగ్గురు డీఆర్జీ జవాన్లు మృతిచెందారు. వెస్ట్ బస్తర్ డివిజన్ బీజాపూర్-దంతేవాడ జిల్లాల సరిహద్దులో బుధవారం ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాలను బస్తర్ రేంజ్ ఐజీ సుందర్రాజ్ పాటిలింగం మీడియాకు వెల్లడించారు.. బీజాపూర్-దంతేవాడ జిల్లాల సరిహద్దులో మావోయిస్టులు సంచరిస్తున్నారనే సమాచారం మేరకు డీఆర్జీ, కోబ్రా, సీఆర్పీఎఫ్, ఎస్టీఎఫ్ భద్రతా దళాల సంయుక్త ఆధ్వర్యంలో సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. ఈ క్రమంలో వారికి మావోయిస్టులు తారసపడి కాల్పులు జరిపారు. వెంటనే అప్రమత్తమైన భద్రతా దళాలు ఎదురుకాల్పులు ప్రారంభించారు.
దీంతో ఇరువర్గాల మధ్య కొన్ని గంటలపాటు భీకరపోరు కొనసాగింది. ఈ ఎన్కౌంటర్లో 12 మంది మావోయిస్టులతో పాటు ముగ్గురు జవాన్లు అక్కడికక్కడే మృతిచెందారు. గాయపడిన మరో ఇద్దరు జవాన్లను మెరుగైన వైద్యం కోసం జిల్లా కేంద్రానికి తరలించారు. మృతిచెందిన జవాన్లలో జిల్లా రిజర్వుడ్ గార్డ్స్(డీఆర్జీ)కి చెందిన హెడ్ కానిస్టేబుల్ మోను వడది, కానిస్టేబుల్ దుకారు గొండే, జవాన్ రమేశ్ సోధీ ఉన్నట్లు ఐజీ పాటిలింగం తెలిపారు. 12 మంది మావోయిస్టుల మృతదేహాలతో పాటు వారికి సంబంధించిన ఒక ఎస్ఎల్ఆర్ రైఫిల్, ఒక ఇన్సాస్ రైఫిల్, ఒక 303 రైఫిల్, ఇతర ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఏడాదిలో ఇప్పటివరకు 275 మంది మావోయిస్టులు ఎదురు కాల్పుల్లో మృతి చెందారు.