Dogs turn blue : ఉక్రెయిన్ (Ukraine) లోని చెర్నోబిల్ (Chernobyl) అణు విద్యుత్ కేంద్రం పరిసరాల్లో ఓ వింత చోటుచేసుకుంది. అక్కడి కొన్ని కుక్కలు (Dogs) ప్రకాశవంతమైన నీలి రంగులోకి మారాయి. ఆ వింత ఫోటోలను ‘డాగ్స్ ఆఫ్ చెర్నోబిల్ (Dogs of Chernobyl)’ అనే స్వచ్ఛంద సంస్థ పంచుకోవడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ పరిణామం శాస్త్రవేత్తలను, స్థానికులను ఆశ్చర్యానికి గురిచేస్తున్నది.
1986లో చెర్నోబిల్ అణు విపత్తు తర్వాత యజమానులు వదిలివెళ్లిపోయిన పెంపుడు జంతువుల సంతతికి చెందినవే ఈ శునకాలు. మానవ సంచారం లేని ఈ ప్రాంతంలో వన్యప్రాణులతో పాటు ఇవి జీవిస్తున్నాయి. ఇక్కడి దాదాపు 700 కుక్కలకు ‘డాగ్స్ ఆఫ్ చెర్నోబిల్’ సంస్థ ఆహారం, ఆశ్రయం, వైద్య సేవలు అందిస్తోంది. ఇటీవలే రొటీన్ స్టెరిలైజేషన్, వైద్య పరీక్షలు నిర్వహిస్తుండగా మూడు కుక్కలు ఇలా వింతగా నీలి రంగులో కనిపించాయని సంస్థ ప్రతినిధులు తెలిపారు.
వారం రోజుల క్రితం వరకు అవి సాధారణంగానే ఉన్నాయని స్థానికులు చెప్పడంతో ఈ మార్పుపై ఆసక్తి పెరిగింది. ఈ కుక్కలు ఏదైనా తెలియని రసాయన పదార్థాన్ని తాకడంవల్లే వాటి బొచ్చు రంగు మారి ఉండవచ్చని సంరక్షకులు అనుమానిస్తున్నారు. పారిశ్రామిక రసాయనాలు లేదా పర్యావరణంలోని భారీ లోహాల ప్రభావం కూడా కారణం కావచ్చని శాస్త్రవేత్తలు విశ్లేషిస్తున్నారు. అసలు కారణం తెలుసుకునేందుకు పరిశోధకులు వాటి బొచ్చు, చర్మం, రక్త నమూనాలను సేకరించే పనిలోపడ్డారు.