చెన్నై: ఎనిమిది నెలల కొడుకు అపార్ట్మెంట్ రూఫ్‌పై వేలాడుతుండటంపై విమర్శలు ఎదుర్కొన్న తల్లి రమ్య ఆదివారం కోయంబత్తూరులో ఆత్మహత్య చేసుకున్నారు. ఏప్రిల్ 28న రమ్య కుమారుడు (8 నెలలు) చెన్నైలోని అవడిలో ఓ అపార్ట్మెంట్ పై కప్పుపై వేలాడుతూ కనిపించాడు. దీనిని గమనించిన పలువురు అక్కడికి వచ్చి, ఆ బాలుడిని కాపాడారు. నెటిజన్లు ఆ విధంగా సహాయపడినవారిని ప్రశంసిస్తూ, తల్లి నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ఈ దుర్ఘటన జరిగిందని విమర్శించారు. కానీ ఇరుగుపొరుగువారు ఆమెకు మద్దతుగా నిలిచారు. ఆమె ఆ బాలుడిని చాలా జాగ్రత్తగా పెంచుతున్నదని చెప్పారు. అయితే ట్రోల్స్‌తో మనస్తాపానికి గురైన ఆమె శనివారం కోయంబత్తూరులోని తన తల్లిదండ్రుల ఇంటికి వెళ్లారు. అక్కడ ఆమె ఆత్మహత్య చేసుకొన్నట్టు పోలీసులు తెలిపారు.