చెన్నై: తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాజధాని చెన్నైలో ఆరేండ్ల రికార్డు స్థాయిలో 21 సెంటీమీటర్ల మేర వాన పడింది. దీంతో చాలా ప్రాంతాలు నీట మునిగాయి. ఈ నేపథ్యంలో వర్షాలకు ప్రభావితమైన చెన్నైతోపాటు పరిసర కాంచీపురం, తిరువళ్లూరు, చెంగల్పట్టు జిల్లాల్లో రెండు రోజులపాటు స్కూళ్లను మూసివేస్తున్నట్లు సీఎం ఎంకే స్టాలిన్ ఆదివారం ప్రకటించారు.
శనివారం రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు నీట మునిగిన పెరంబూర్ బ్యారక్స్ రోడ్డు, ఒట్టేరి బ్రిడ్జి, పాడి తదితర ప్రభావిత ప్రాంతాలను సీఎం స్టాలిన్ సందర్శించారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ఇబ్బందులు పడుతున్న ప్రజలకు సహాయ సహకారాలు అందించి ఆదుకోవాలని డీఎంకే కార్యకర్తలు, ఎమ్మెల్యేలు, ఎంపీలకు ఆయన పిలుపునిచ్చారు.
మరోవైపు తమిళనాడుతోపాటు పొరుగున ఉన్న పుదుచ్చేరిలో ఆదివారం భారీగా వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ మేరకు ‘రెడ్’ కేటగిరీ వార్నింగ్ జారీ చేసింది.