చెన్నై: సినిమా తరహాలో కుటుంబాన్ని ఎదిరించి పెళ్లి చేసుకోవాలని ప్రేమికుల జంట భావించింది. అయితే వారి వ్యూహం బెడిసికొట్టింది. వరుడి చేతి నుంచి మంగళసూత్రం లాక్కొని ప్రియురాలికి కట్టబోయిన ప్రియుడ్ని అక్కడి వారు చావకొట్టారు. తమిళనాడు రాజధాని చెన్నైలో ఈ సంఘటన జరిగింది. సహోద్యోగులైన ఒక జంట కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. అయితే వారి పెళ్లికి యువతి తరుఫు కుటుంబం ఒప్పుకోలేదు. ఆ మహిళకు మరో వ్యక్తితో పెళ్లి చేసేందుకు ఆమె కుటుంబం సిద్ధమైంది. దీంతో ఎలాగైనా పెళ్లి చేసుకోవాలని భావించిన ఆ జంట ఒక ప్లాన్ వేసింది. సినిమా తరహాలో కళ్యాణ మండపంలో తన మెడలో తాళి కట్టాలని ప్రియుడికి ప్రియురాలు చెప్పింది.
శుక్రవారం ఉదయం చెన్నైలోని తొండియార్పేటలో ఆ మహిళకు పెళ్లి జరిగే కళ్యాణ వేదిక వద్దకు ఆమె ప్రియుడు వచ్చాడు. పురోహితుడు మంగళసూత్రం కట్టాలని వరుడికి చెప్పాడు. ఇంతలో వేదిక వద్ద పక్కనే ఉన్న వధువు ప్రియుడు, వెంటనే వరుడి చేతి నుంచి తాళి లాక్కున్నాడు. వధువు మెడలో కట్టేందుకు ప్రయత్నించాడు. అయితే పెళ్లి వేదికపై ఉన్నవారు అతడ్ని పట్టుకుని వెనక్కిలాగారు. అతడి ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. అంతా కలిసి ఆ యువకుడ్ని కొట్టారు.
మరోవైపు ఈ సంఘటన వధువరుల కుటుంబాల మధ్య ఘర్షణకు దారి తీసింది. చివరకు పోలీసులు జోక్యం చేసుకున్నారు. వారు ఎంత నచ్చజెప్పినా గొడవ సద్దుమణగలేదు. దీంతో ఆ పెళ్లి నిలిచిపోయింది. అయితే తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. ఈ సమస్యను తాము పరిష్కరించుకుంటామని ఇరు కుటుంబాలు తెలిపాయని చెప్పారు.