న్యూఢిల్లీ, ఫిబ్రవరి 4: పదిహేను రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న వేళ పంజాబ్‌లో కీలక పరిణామం చోటు చేసుకొన్నది. మనీ ల్యాండరింగ్ కేసులో పంజాబ్ సీఎం చరణ్‌జీత్ సింగ్ చన్నీ బంధువు (మరదిలి కుమారుడు) భూపిందర్ సింగ్‌ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) గురువారం రాత్రి అరెస్టు చేసింది. అంతకుముందు జలంధర్‌లోని ఈడీ కార్యాలయంలో అధికారులు భూపిందర్ సింగ్‌ను కొన్ని గంటల పాటు ప్రశ్నించారు. పంజాబ్‌లో ఈ నెల 20న అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. తమ పార్టీ సీఎం అభ్యర్థి ఎవరనేది కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ నేడో.. రేపో ప్రకటించనున్నారు. కాంగ్రెస్ తరఫున సీఎం అభ్యర్థి చన్నీనే అని చాలా మంది భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో చన్నీ బంధువును ఈడీ అరెస్టు చేయడం ప్రాధాన్యం సంతరించుకోవడమే కాదు పంజాబ్‌లో రాజకీయంగా తీవ్ర సంచలనం కలిగించింది. నిబంధనలకు విరుద్ధంగా భూపిందర్ సింగ్ పంజాబ్‌లో ఇసుక తవ్వకాలు చేపట్టారని ఆరోపణలు ఉన్నాయి. దీనిపై గతేడాది నవంబర్లోనే ఆయనపై క్రిమినల్ కేసు నమోదైంది. జనవరి 18న భూపీందర్ నివాసాల్లో ఈడీ సోదాలు నిర్వహించింది. రూ.8 కోట్ల నగదు, పలు పత్రాలను స్వాధీనం చేసుకొన్నది. తాజాగా ఆయన్ను అరెస్టు చేసింది.
బెంగాల్లో కూడా ఇలాగే
భూపిందర్ సింగ్ అరెస్టుపై సీఎం చన్నీ స్పందించారు.‘బెంగాల్లో ఎన్నికల సమయంలో సీఎం మమత బంధువులపై ఐటీ, ఈడీ సోదాలు జరిగాయి. ఇప్పుడు పంజాబ్‌లో ఎన్నికల సమయంలో కూడా అలాంటి పరిణామాలే జరుగుతున్నాయి. నాపై, కాంగ్రెస్ పార్టీ నేతలపై, కార్యకర్తలపై ఒత్తిడి తేవడానికే ఇదంతా చేస్తున్నారు’ అని ఆయన మండిపడ్డారు.
చన్నీ తప్పించుకోలేరు
భూపిందర్ అరెస్టుతో పంజాబ్‌లో ప్రతిపక్షాలు కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించాయి.‘ఈడీ మొదట నగదు స్వాధీనం చేసుకొన్నది. ఇప్పుడు భూపీందర్‌ను అరెస్టు చేశారు. దీనిపై సమాధానం చెప్పకుండా చన్నీ ఎలా తప్పించుకోగలరు’అని శిరోమణి అకాలీదళ్ నేత బిక్రమ్ సింగ్ ప్రశ్నించారు.