న్యూఢిల్లీ: చంద్రయాన్-5 మిషన్‌కు ఇటీవల కేంద్రం ఆమోదం తెలిపినట్లు ఇస్రో చైర్మెన్( ISRO chief) వీ నారాయణన్ తెలిపారు. బెంగుళూరులోని ఇస్రో కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. చంద్రయాన్-3 ద్వారా 25 కేజీల బరువున్న ప్రజ్ఞాన్ రోవర్‌ను తీసుకెళ్లారని, అయితే చంద్రయాన్-5 ద్వారా 250కేజీల బరువున్న రోవర్ చంద్రుడి మీదకు వెళ్లనున్నట్లు ఆయన చెప్పారు.
చంద్రుడి ఉపరితలాన్ని అధ్యయనం చేసేందుకు చంద్రయాన్ మిషన్ చేపట్టిన విషయం తెలిసిందే. 2008లో చంద్రయాన్-1 మిషన్‌ను విజయవంతంగా చేపట్టారు. ఆ ప్రయోగం ద్వారా చంద్రుడిపై ఉన్న రసాయనిక, ఖనిజ, ఫోటో జియోలాజిక్ మ్యాపింగ్ చేశారు. చంద్రయాన్-2 మిషన్‌ను 2019లో చేపట్టారు. ఆ ప్రాజెక్టు 98 శాతం సక్సెస్ అయ్యింది. మరో రెండు శాతం ప్రాజెక్టు.. చివరి క్షణాల్లో విఫలమైంది.
అయితే చంద్రయాన్-2 ద్వారా పంపిన హై రిజల్యూషన్ కెమెరా ఇప్పటికీ వందల సంఖ్యలో ఇమేజ్‌లను పంపుతున్నట్లు ఇస్రో చీఫ్ నారాయణన్ తెలిపారు. చంద్రయాన్-2కు కొనసాగింపు నిర్వహించిన చంద్రయాన్-3 మిషన్ ద్వారా.. సేఫ్ ల్యాండింగ్, రోవర్ మూమెంట్ పరీక్షలు చేపట్టారు.