బెంగళూరు: చంద్రయాన్-3 మరో కీలక మైలురాయిని చేరుకోనుంది. వ్యోమనౌక విజయవంతంగా భూ కక్ష్యను దాటి చంద్రుడి కక్ష్య దిశగా ప్రయాణాన్ని ప్రారంభించింది. మంగళవారం ఈ ప్రక్రి య సాఫీగా సాగిందని ఇస్రో తెలిపింది. 5 రోజుల తర్వాత వ్యోమ నౌక చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశిస్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు. ‘ఇస్రో టెలిమెట్రీ, ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్వర్క్ సెంటర్లో వ్యోమనౌక కక్ష్య పెంపు ప్రక్రియ విజయవంతంగా పూర్తైంది. వ్యోమనౌకను చంద్రుడి కక్ష్యలోకి జొప్పించాము’ అని ఇస్రో తెలిపింది. ఆగస్టు 23న చంద్రుడిపై అడుగుపెట్టనున్నట్టు వెల్లడించింది. జూలై14న ప్రయో గం జరిగిన నాటి నుంచి ఇప్పటివరకు వ్యోమనౌక కక్ష్యను అయిదుసార్లు పెంచారు.