కార్తిక మాసపు రాత్రి వేళ కావాలనే మేలుకున్నాను!
చల్లని తెల్లని వెన్నెల అంతటా పడుతున్నది!
మెత్తని పుత్తడి వెన్నెల భూమి ఒంటిని హత్తుకున్నది!!
అన్నాడు కవి తిలక్.
ఇండియా.. నా మజిలీ చేరాను. మీరు కూడా: విక్రమ్ సందేశం
జయము జయము విక్రముడా!
విజయము నీకు పరాక్రముడా!
అహో! అందాల అమృతకరా..
ఇది విక్రముడి ఆగమనం
దక్షిణపథాన ఇస్రోదూత పాదం
అంతరిక్షమే అబ్బురపడగా..
పాలపుంతలు పరవశించిపోగా..
నక్షత్రాలు నక్కినక్కి చూడగా..
భూమ్యాకాశాలు పులకించిపోగా..
అన్ని దేశాలు అచ్చెరువొందగా..
సకల లోకముల సాక్షిగా..
చంద్రలోకం ఇస్రోకు వశమైంది!
చంద్రయాన్-3 విజయవంతమైంది!!
విశ్వమంతా భారత్‌కు జేజేలు పలికింది!!!
Chandrayaan 3
వెండి వెన్నెల కాదు; ఇప్పుడు భూమి తల్లే చందమామను హత్తుకున్నది. పూర్ణ చంద్రుడి వెండి వెన్నెల సముద్రపు అలల మీద తెల్లగా తేలియాడుతుంటే, ‘జాబిల్లి సముద్రం మీద సంతకం చేసినట్టు’ందన్నడు శ్రీశ్రీ. ఇప్పుడు మనమే జాబిల్లిపై మువ్వన్నెల సంతకం చేసినం. ‘చందమామ రావే, జాబిల్లి రావే, కొండెక్కి రావే, గోగు పూలు తేవే’ అని చిన్నప్పటి నుంచీ పాడీపాడీ అలసిపోయి, నువ్వెంతకూ రాకపోతే, ఇప్పుడు మేమే నీ చెంతకు చేరుకున్నం. భారతీయుడు త్రి‘విక్రముడై’ పరాక్రమించి, మనసుకు దగ్గరైన చందమామను, మనిషికి కూడా దగ్గర చేసిండు. ఇప్పటిదాకా విశ్వ వీధుల్లో గర్వంగా ఎగిరిన త్రివర్ణ పతాక, ఇప్పుడు ఖగోళ వినీలాకాశంలోనూ గర్వంగా విహరిస్తున్నది. పట్టువదలని విక్రమార్కులై ప్రయత్నించిన ఇస్రో శాస్త్రవేత్తల సంకల్ప బలానికి పరిమితులు, అవరోధాలు ప్రణమిల్లి పక్కకు తొలిగాయి. కోట్లాది భారతీయుల గుండె చప్పుళ్లే చప్పట్ల చప్పుడై ప్రతిధ్వనిస్తుండగా, విక్రమ్ విజయవంతంగా చంద్రుడిపై దిగింది.
మామా… ఇక మాట్లాడుకుందామా?!
అద్భుతం.. అసామాన్యం.. అనిర్వచనీయం.. ప్రపంచమంతా కన్నార్పకుండా చూస్తుండగా, భారతీయులంతా మునివేళ్లపై నిలబడి ఊపిరి బిగపట్టిన క్షణాన ఓ గొప్ప చరిత్ర ఆవిష్కృతమైంది. అగ్రదేశాలకు కూడా సాధ్యం కాని అద్భుతాన్ని భారత్ ఆవిష్కరించింది. చందమామ రావే.. జాబిల్లి రావే అని పాడుకోవటమే కాదు.. చందమామను చంకలో పెట్టుకొని తిరగ్గలమని నిరూపించింది. అమెరికా, రష్యా, జపాన్, ఇజ్రాయెల్, చైనా వంటి అత్యాధునిక సాంకేతిక ఉన్న దేశాలకు కూడా సాధ్యం కాని అంతరిక్ష అద్భుతాన్ని భారత్ గ‘ఘన’ంగా ఆవిష్కరించింది. చంద్రమామ దక్షిణ ధ్రువంపై కాలుపెట్టిన తొట్టతొలి దేశంగా ఘనత సాధించింది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో పంపిన విక్రమ్ ల్యాండర్ బుధవారం సాయంత్రం 6.04 గంటలకు చందమామను ముద్దాడింది. ‘నేను నా గమ్యాన్ని చేరాను.. నాతోపాటు మీరు కూడా’ అని విక్రమ్ తొలి సందేశాన్ని పంపింది. ల్యాండర్ చంద్రుడి ఉపరితలంపై కాలుమోపిన ఆ క్షణం యావత్ భారతదేశం సింహనాదం చేసింది. ఇస్రోకు జయజయధ్వానాలు పలికింది. అగ్రదేశాలకు ఇక మేం ఏమాత్రమూ తీసిపోమని 140 కోట్లమంది భారతీయులు గర్జించారు. అద్భుతం చేసి చూపిన ఇస్రోను రాష్ట్రపతి, ప్రధాని, తెలంగాణ ముఖ్యమంత్రి సహా రాజకీయ, సినిమా, శాస్త్ర సాంకేతిక రంగ ప్రముఖులు, సామాన్యులు శుభాకాంక్షలతో ముంచెత్తారు.
గగనమంత విజయం
చంద్రుడిపై పరిశోధనల కోసం ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్-3లోని విక్రమ్ చందమామ దక్షిణ ధ్రువ ప్రాంతంలో సురక్షితంగా దిగింది. నిర్దేశించిన సమయానికి అంటే సాయంత్రం 6.04 గంటలకు చంద్రుడి ఉపరితలంపై సురక్షితంగా కాలుమోపింది. చంద్రయాన్-3ని ఇస్రో జూలై 14న ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోట సతీశ్‌ధావన్ రాకెట్ ప్రయోగ కేంద్రం నుంచి నింగిలోకి పంపింది. 40 రోజుల ప్రయాణం తర్వాత చందమామను విక్రమ్ ల్యాండర్ చేరుకుంది. సుయారు ల్యాండర్ దిగినప్పుడు లేచిన దుమ్ము కారణంగా నాలుగు గంటల తర్వాత రోవర్ ప్రజ్ఞాన్ బయటికి వచ్చింది. రోవర్ బయటికి వచ్చిన తర్వాత ఒక చంద్ర దినం పాటు (భూమిపై 14 రోజులు) వివిధ రకాల పరిశోధనలు నిర్వహిస్తుంది. ల్యాండర్ ఒక్కో అడుగు కిందికి దిగుతున్న సమయంలో కోట్లమంది భారతీయులు ఊపిరి బిగపట్టి వీక్షించారు. ల్యాండింగ్ ప్రక్రియను ఇస్రో ప్రత్యక్ష ప్రసారం చేయటంతో లక్షలమంది టీవీలకు అతుక్కుపోయారు. ఇస్రోను అనేక దేశాల అంతరిక్ష పరిశోధన సంస్థలు వేనోళ్ల కొనియాడాయి. చంద్రుడిపై పరిశోధనల్లో ఇస్రోతో కలిసి పనిచేస్తున్నందుకు గర్వంగా ఉన్నదని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా తెలిపింది. ఈయూ అంతరిక్ష పరిశోధన సంస్థ శుభాకాంక్షలు తెలిపింది.
దక్షిణ ధ్రువం ప్రాంతంపై తొలి అడుగు
చంద్రునిపైకి ఇప్పటికే అమెరికా, యూఎస్ఎస్ఆర్, చైనా రోవర్లను పంపాయి. కానీ, వీటిలో ఏ దేశమూ దక్షిణ ధ్రవ ప్రాంతంలో దిగలేదు. మొట్టమొదటిసారి భారతదేశమే ఆ ఘనత సొంతం చేసుకొన్నది. మొత్తంగా చంద్రుడిపై అంతరిక్ష పరిశోధన మాడ్యూల్‌ను సురక్షితంగా దింపిన నాలుగో దేశంగా అవతరించింది.
ఆశలు రేపుతున్న దక్షిణ ధ్రువ ప్రాంతం
అంతరిక్ష పరిశోధనల్లో పట్టున్న ప్రతిదేశం ఇప్పుడు చంద్రుడి దక్షిణ ధ్రువంపైనే కన్నేసింది. 2009లో ఇస్రో చేపట్టిన చంద్రయాన్-1 ప్రయోగం ద్వారా పంపిన అమెరికాకు చెందిన ఓ పరికరం ఇక్కడ నీటి జాడలను గుర్తించింది. దీంతో అక్కడ మరిన్ని పరిశోధనలు చేసి నీటిని సంపూర్ణంగా గుర్తించాలని అమెరికా, రష్యా, చైనా, యూరోపియన్ యూనియన్, జపాన్, ఇజ్రాయెల్, భారత్ తీవ్రంగా పోటీ పడుతున్నాయి. భవిష్యత్తులో సుదూర అంతరిక్ష యాత్రలకు చంద్రుడిని ఒక స్థావరంగా వాడుకోవచ్చని అనేక దేశాలు ఇప్పటికే ప్రణాళికలు వేస్తున్నాయి. అందుకే ఈ ప్రాంతంపై అన్ని దేశాల దృష్టి పడింది.
ఫొటోలు పంపిన విక్రమ్
చందమామపై దిగుతూనే ల్యాండర్ విక్రం తన పని మొదలుపెట్టింది. చంద్రుడి ఉపరితలానికి సంబంధించిన స్పష్టమైన ఫొటోలు తీసి ఇస్రోకు పంపింది.
దక్షిణ ధ్రువం ఇక చంద్రగంగోత్రి
చంద్రుడి దక్షిణ ధ్రువ ప్రాంతానికి చేరుకొన్న తొలి దేశంగా రికార్డు సృష్టించిన భారత్.. ఆ ప్రాంతానికి ‘చంద్ర గంగోత్రి’గా ఇస్రో నామకరణం చేసింది. దక్షిణ ధ్రువమైన అంటార్కిటికాలోని భారత పరిశోధన కేంద్రానికి గుర్తు చేస్తూ చంద్ర గంగోత్రి అని పేరు పెట్టారు.
క్షణ క్షణం టెన్షన్ టెన్షన్
విక్రం ల్యాండర్ చంద్రుడిపై దిగే సమయంలో ఇస్రో ప్రధాన కార్యాలయంతోపాటు ప్రపంచమంతా తీవ్ర ఉత్కంఠ నెలకొన్నది. చంద్రయాన్-2 ప్రయోగం ఇదే స్టేజ్‌లో విఫలమైన అనుభవం ఉండటంతో చంద్రయాన్-3పై ఉత్కంఠను మరింత పెంచింది. విక్రమ్ ల్యాండర్ చంద్రుడిపై దిగే క్రమాన్ని నాలుగు దశలుగా విభజించారు.
మొదటి దశను రఫ్ బ్రేకింగ్ ఫేజ్ అంటారు. చంద్రుడి చుట్టూ తిరుగుతున్న విక్రమ్ తన వేగాన్ని సెకనుకు 1.68 కిలోమీటర్ల (గంటకు 6000 కిలోమీటర్లు) నుంచి సున్నా కిలోమీటర్లకు స్వయంగా తగ్గించుకొన్నది.
రెండో దశను అట్టిట్యూడ్ హోల్డ్ ఫేజ్ అంటారు. ఈ దశ 10 సెకండ్లే ఉంటుంది. ఇంత తక్కువ సమయంలోనే ల్యాండర్ చంద్రుడి ఉపరితలానికి 7.42 కిలోమీటర్ల ఎత్తునుంచి నిట్ట నిలువుగా కిందికి దిగుతూ 3.48 కిలోమీటర్ల దిగువకు వచ్చి స్థిరంగా నిలబడాలి.
మూడో దశను ఫైన్ బ్రేకింగ్ ఫేజ్ అంటారు. నాలుగు దశల్లో ఇదే సుదీర్ఘమైనది. ఇది 175 సెకండ్లపాటు కొనసాగింది. మొత్తం ప్రయోగంలో ఇదే అత్యంత క్లిష్టమైనది. ఈ దశలోనే ల్యాండర్ తన కాళ్లను చంద్రుడి ఉపరితలంవైపు మళ్లించుకొన్నది. ఉన్నచోటి నుంచి కదలకుండానే తాను దిగాల్సిన ప్రదేశాన్ని గుర్తించింది. అప్పుడు ల్యాండర్ ఉపరితలానికి 800-1000 మీటర్ల ఎత్తులో ఉన్నది. చంద్రయాన్ – 2 ఈ దశలోనే విఫలమైంది. చంద్రయాన్-3లో మాత్ర ఇస్రో ఆ పొరపాటు చేయలేదు.
నాలుగో దశను టెర్మినల్ డిసెంట్ ఫేజ్ అంటారు. ఈ దశలో ల్యాండర్ మెల్లగా కిందికి దిగుతూ చంద్రుడి ఉపరితలంపై సురక్షితంగా తన పాదాలను ఉంచింది.
Murmu
దేశాన్ని గర్వపడేలా చేసిన ఈ క్షణం మరువలేనిది. మన శాస్త్రవేత్తలు చరిత్ర సృష్టించారు. జీవితంలో ఒక్కసారే జరిగే ఇలాంటి విజయం సాధించిన ఇస్రోకు, ఈ మిషన్‌లో భాగమైన వారందరికీ నా అభినందనలు.
-ద్రౌపది ముర్ము, రాష్ట్రపతి.
Pm Modi
ఈ విజయం యావత్ మానవాళికి చెందుతుంది. భారతదేశం భూమిపై ఒక సంకల్పానికి పూనుకుని దానిని చంద్రుడిపై నెరవేర్చింది. ఇది గౌరవించాల్సిన క్షణం. చంద్ర మార్గంలో నడవడానికి సమయం ఆసన్నమైంది.
-ప్రధాని నరేంద్రమోదీ
ఇది ప్రతి భారతీయుడు గర్వించదగ్గ సందర్భం. ఈ ప్రయోగం విజయవంతం కావడంలో భాగస్వాములైన ప్రతి ఒకరికీ అభినందనలు. భారతీయుల చిరకాల ఆకాంక్ష నెరవేరిన ఈ రోజు అందరికీ పండగలాంటిది. భవిష్యత్‌లో ఇస్రో చేపట్టబోయే అంతరిక్ష ప్రయోగాలకు చంద్రయాన్-3 విజయం గొప్ప ప్రేరణినిస్తుంది. ఇదే స్ఫూర్తిని ఇస్రో కొనసాగించాలి. దేశ కీర్తి ప్రతిష్టలను మరింతగా పెంచే దిశగా అంతరిక్ష పరిశోధన రంగంలో ఇస్రో విజయ పరంపరను కొనసాగించాలి.
-సీఎం కే చంద్రశేఖర్ రావు
Ktr2
విక్రమ్ సాఫ్ట్ ల్యాండ్ కావడం భారతదేశ అంతరిక్ష ప్రయోగాల్లో చారిత్రక మైలురాయిగా నిలుస్తుంది. ఈ ఘనతను సాధించేందుకు అంకితభావంతో కృషి చేసిన ఇస్రో బృందానికి హృదయపూర్వక అభినందనలు.
– ఐటీ శాఖ మంత్రి కేటీఆర్
Isro Chairman Somanath
శాస్త్రవేత్తలందరికీ అభినందనలు. దేశం కోసం స్ఫూర్తిదాయక కార్యక్రమాన్ని నిర్వహించినందుకు ఎంతో గర్వంగా ఉంది. వచ్చే 14 రోజులు ఎంతో ఆసక్తికరంగా ఉంటాయి.
-ఇస్రో చైర్మన్ సోమనాథ్