హైదరాబాద్ సిటీబ్యూరో (నమస్తే తెలంగాణ): చంద్రయాన్-3 ప్రయోగం విజయవంతమైతే భారత ఆర్థిక వ్యవస్థ మరింత బలపడుతుందని ఉస్మానియా యూనివర్సిటీ ఆస్ట్రానమీ డిపార్ట్మెంట్ హెడ్ డీ శాంతిప్రియ తెలిపారు. చంద్రయాన్-3 పరిశోధన ద్వారా సేకరించే సమాచారం రాబోయే రోజుల్లో నాసా చేపట్టే ప్రయోగాలకు కీలకమని ఆమె పేర్కొన్నారు. చంద్రయాన్-3 ప్రాజెక్టు గురించి అనేక విషయాలను ఆమె ‘నమస్తే తెలంగాణ’తో పంచుకున్నారు.
కొత్త విషయాలు తెలుస్తాయి..
చంద్రుడి ఉపరితలంపై ప్రతికూల పరిస్థితులు ఉంటాయి. అందుకే రష్యా మూన్ మిషన్ లూనా-25 విఫలమైంది. కానీ విక్రమ్ ల్యాండర్ చంద్రుడిపై కాలుమోపేలా ఇస్రో చర్యలు చేపట్టింది. కచ్చితంగా విజయవంతంగా సాఫ్ట్ ల్యాండింగ్ అవుతుందనే నమ్మకం ఉంది. ఈ ప్రయోగం విజయవంతమైతే చంద్రుడి గురించి అనేక కొత్త విషయాలు భారత్ ద్వారా ప్రపంచానికి తెలుస్తాయి. చంద్రుడి స్థలాకృతి, కూర్పుపై విలువైన సమాచారం తెలుస్తుంది. భవిష్యత్తులో ఇంటర్ ప్లానెటరీ మిషన్లకు చంద్రయాన్ -3 ఒక మార్గదర్శకంగా మారుతుంది.
చంద్ర కంపాలపై అధ్యయనం..
రోవర్లోని పేలోడ్స్ చంద్రుడి ఉపరితలానికి సంబంధించి వివిధ అంశాలను అధ్యయనం చేస్తుంది. చంద్ర కంపాలు, ఉపరితలంపై జరిగే మార్పులు, ఉష్ణ లక్షణాలు, భూమి, చంద్రుడి మధ్య దూరాన్ని కచ్చితత్వంతో కొలవడం, ఇతర గ్రహాలను గుర్తించడం ఈ మిషన్ ప్రధాన లక్ష్యాలు.
వేగాన్ని నియంత్రించేందుకు సాధనాలు
అధిక వేగం వల్ల చంద్రయాన్-2 చంద్రుడి ఉపరితలంపై కూలిపోయింది. చంద్రయాన్-3 విషయంలో ఈ తప్పిదం జరగకుండా ల్యాండర్ స్థిరత్వాన్ని, దృఢత్వాన్ని పెంచడానికి దానిలో మార్పులు చేశారు. ల్యాండర్ వేగాన్ని పర్యవేక్షించేందుకు నావిగేషన్, గైడెన్స్ సాధనాలను అమర్చారు. ల్యాండర్ వేగాన్ని కొలిచేందుకు లేజర్ డాప్లర్ వెలోసి మీటర్ (ఎల్డీవీ) కూడా అమర్చారు. వీటి ద్వారా ల్యాండర్ వేగం నియంత్రణలో ఉంటుంది.