న్యూఢిల్లీ: ఇస్రో మరో మైలురాయిని అందుకుంది. చంద్రుడిపై నీళ్లు ఉన్నాయని తెలిపే కచ్చితమైన ఆధారాలను గుర్తించింది. చంద్రయాన్-2 డాటా సాయంతో అత్యంత శీతలమైన, రహస్యమైన చంద్రుడి దక్షిణ ధృవం వద్ద మంచు ఉన్నట్టు సైంటిస్టులు గుర్తించారు. గుజరాత్ లోని అహ్మదాబాద్ ఫిజికల్ రిసెర్చ్ ల్యాబొరేటరీ శాస్త్రవేత్తలు ఈ విషయాన్ని గుర్తించినట్టు ఇస్రో తెలిపింది.
చంద్రయాన్ 2 ఆర్బిటార్లోని డ్యూయల్ ఫ్రీక్వెన్సీ సింథటిక్ అపర్చర్ రాడార్ (డీఎఫ్ఎస్ఏఆర్) సాయంతో మంచును గుర్తించారు. దక్షిణ ధృవంలోని బిలాల అడుగున ఈ మంచు ఉన్నట్టు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఇక్కడ 25 కెల్విన్ లేదా మైనస్ 248 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు ఉంటాయి. బిలియన్ల ఏండ్ల కిందినుంచే ఇక్కడ మంచు ఏర్పడ్డట్టు సైంటిస్టులు చెబుతున్నారు. చంద్రుడి ధ్రువప్రాంతాల్లో మంచు, నీరు ఉన్నాయనేందుకు తాజా ఆవిష్కరణ మరో బలమైన ఆధారంగా నిలువనున్నది.