చండీఘడ్: హర్యానాకు చెందిన ఐపీఎస్ ఆఫీసర్(IPS Officer) వై పూరన్ కుమార్ తన సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఆయన మృతదేహానికి పోస్టు మార్టం నిర్వహించేందుకు హర్యానా పోలీసులు తొందరపడుతున్నట్లు భార్య, ఐఏఎస్ ఆఫీసర్ అమ్నీత్ పీ కుమార్ ఆరోపించారు. తన భర్త పార్దీవ దేహాన్ని అప్పగించడంలో హర్యానా పోలీసులు ఎటువంటి హుందాతనాన్ని ప్రదర్శించలేదని ఆమె ఆరోపించారు. కుటుంబ సభ్యులు లేకుండానే తన భర్త పార్దీవదేహాన్ని పోలీసులు పోస్టుమార్టమ్‌కు తీసుకెళ్లినట్లు ఆరోపించారు.
తన భర్త దళిత వర్గానికి చెందిన వ్యక్తి అని, పోస్టు మార్టమ్‌కు అంగీకరించానని, పిల్లలు చివరిచూపు చూసే వరకు వేచి ఉండాలని కోరానని, కానీ పోలీసులు ఇవేమీ పట్టించుకోలేదని, కుటుంబసభ్యులు లేకున్నా.. ఆస్పత్రి నుంచి తన భర్త మృతదేహాన్ని తీసుకెళ్లినట్లు అమ్నీత్ కుమార్ ఆరోపించారు. తానొక దళిత వింతతువును అని ఆమె పేర్కొన్నారు. చండీఘడ్ పోలీసుల ఆధీనంలోనే అన్నీ ఉన్నాయని, వాళ్లకు నచ్చినట్లు వాళ్లు చేసుకోనివ్వండి, కుటుంబంతో సంబంధం లేకుండా వ్యవహరిస్తున్నారని, ఇప్పటి వరకు మౌనంగా ఉండి మర్యాదగా వ్యవహరించానని, కానీ తన చేతుల్లోంచి పరిస్థితి జారిపోతోందని, పోస్టుమార్టమ్‌కు తొందరెందుకని, చండీఘడ్ పోలీసుల తమ ప్రవర్తనకు వివరణ ఇవ్వాల్సి ఉంటుందని ఆమె అన్నారు.
సెక్టర్ 16 ఆస్పత్రి నుంచి పీజీఐకి మృదేహాన్ని అప్పగించే సమయంలో కీలక ఆధారాలు ధ్వంసం అయ్యే అవకాశం ఉన్నట్లు ఆమె తెలిపారు. ఆ లోపాలకు చండీఘడ్ పోలీసులే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. అయితే కుటుంబం ఓకే చెప్పిన తర్వాతనే పోస్టు మార్టమ్ నిర్వహిస్తామని డీజీపీ సాగర్ ప్రీత్ హూడా తెలిపారు. నాలుగు రోజుల తర్వాత ఐపీఎస్ ఆఫీసర్ పూరన్ కుమార్ కుటుంబం పోస్టు మార్టమ్‌కు అంగీకరించినట్లు తెలిసింది.