చండీగఢ్: కేంద్ర పాలిత ప్రాంతమైన చండీగఢ్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. మొత్తం 35 మున్సిపల్ వార్డులకుగాను ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) 14 వార్డుల్లో గెలిచి టాప్‌లో నిలిచింది. బీజేపీ 12 వార్డుల్లో, కాంగ్రెస్ 8 వార్డుల్లో, శిరోమణి అకాలీదళ్ ఒక వార్డులో గెలుపొందాయి. పంజాబ్, హర్యానా రాజధాని అయిన చండీగఢ్ మున్సిపల్ కార్పొరేషన్‌కు శుక్రవారం ఎన్నికలు జరుగగా, సోమవారం కౌంటింగ్ నిర్వహించారు.
కాగా, వచ్చే ఏడాది జరుగనున్న పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలపై దృష్టిసారించిన ఆప్, చండీగఢ్ కార్పొరేషన్ ఎన్నికల్లో విజయం సాధించడంపై సంబరాల్లో మునిగిపోయింది. ఆప్, అరవింద్ కేజ్రీవాల్ తరుఫున చండీగఢ్ ప్రజలకు ఆ పార్టీ నేత రాఘవ్ చద్దా కృతజ్ఞతలు తెలిపారు. పోటీ చేసిన తొలిసారే తమ లాంటి చిన్న, నిజాయితీ గల పార్టీకి ఇంత ప్రేమ, నమ్మకాన్ని అందించినందుకు ప్రజలకు ధన్యవాదాలు తెలియజేశారు. చండీగఢ్ కేవలం ట్రైలర్ మాత్రమేనని అసలు సినిమా పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలని వ్యాఖ్యానించారు.