(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, జూలై 30 (నమస్తే తెలంగాణ): వయనాడ్ విలయం ఓ నదిని శవాల దిబ్బగా మార్చేసింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 26 మృతదేహాలు కొట్టుకొచ్చిన దృశ్యాలు చూపరులను కంటతడి పెట్టించాయి. మల్లప్పురంలోని చలియార్ నదిలో 26 మృతదేహాలు తేలియాడుతూ కనిపించినట్టు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. చాలా వాటికి శరీర భాగాలు లేవు అని తెలిపారు. కొన్ని మృతదేహాలకు మొండేలు మాత్రమే ఉన్నాయని, మరికొన్నింటికి చేతులు, కాళ్లు లేవని వెల్లడించారు. ఈ రకంగా కొట్టుకొచ్చిన మూడేండ్ల పాప మృతదేహం ఒకటి స్థానికులను కలచివేసింది. బాధితులను రక్షించడానికి, మృతదేహాలను ఒడ్డున చేర్చడానికి గజ ఈతగాళ్లను, రెండు ఐఏఎఫ్ హెలికాప్టర్లను రంగంలోకి దించారు.
చలియార్ నదిలో మృతదేహాలు కొట్టుకొచ్చిన వార్త నిజమేనని ఎమ్మెల్యే ఐసీ బాలకృష్ణన్ ధ్రువీకరించారు. ఎమ్మెల్యే టి సిద్ధిఖీ మాట్లాడుతూ.. ముండకై గ్రామంలో పరిస్థితి ఊహించిన దానికంటే ఇంకా ఎంతో భయానకంగా ఉన్నదని పేర్కొన్నారు.