న్యూఢిల్లీ: జన సమ్మర్థం అధికంగా ఉండే 60 రైల్వే స్టేషన్లలో అదనపు ప్రయాణికుల రద్దీని సజావుగా నిర్వహించేందుకు పర్మనెంట్ హోల్డింగ్ జోన్స్‌ను నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, దీని కోసం కృత్రిమ మేధ (ఏఐ)ని కూడా ఉపయోగించాలని భావిస్తున్నది.
న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో జరిగిన తొక్కిసలాటలో 18 మంది మరణించిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ ఆలోచన చేస్తున్నది. దీనిలో భాగంగా, సంక్షోభ నిర్వహణ, పరిస్థితులపై అవగాహనలో స్థానిక అధికారులకు శిక్షణ ఇస్తారు. ప్రయాణికులను డిజిగ్నేటెడ్ హోల్డింగ్ ఏరియాస్ వైపు పంపించేందుకు బాణం గుర్తులు, సెపరేటర్స్ను ఏర్పాటు చేస్తారు. కృత్రిమ మేధతో సహా సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటారు. ముఖ్యంగా రైళ్లు ఆలస్యమైనపుడు ప్రయాణికులను పర్యవేక్షించేందుకు వీటిని ఉపయోగిస్తారు.