Unemployment | మలేషియా జనాభా 3.3 కోట్లు. వీళ్లకు సేవ చేయడానికి కేంద్ర ప్రభుత్వశాఖల్లో 17 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. అంటే ప్రతి 20 మంది పౌరులకు సేవ చేయడానికి ఒక ఉద్యోగి ఉన్నాడన్న మాట. భారత్ జనాభా 142 కోట్లు. కేంద్ర ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగులు 30 లక్షలు. ఈ లెక్కన ప్రతి 470 మంది భారతీయులకు ఒక ఉద్యోగి కూడా లేడు. కేంద్ర ప్రభుత్వ శాఖల్లో పోస్టుల మంజూరు, భర్తీ ప్రక్రియ ఎలా సాగుతున్నదో అర్థమవ్వాలంటే ఈ ఒక్క ఉదాహరణ చాలు.
హైదరాబాద్, జూన్ 21 (స్పెషల్ టాస్క్ బ్యూరో-నమస్తే తెలంగాణ): ప్రపంచంలోనే అత్యధిక జనాభా గల దేశంగా భారత్ రికార్డు సృష్టించింది. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా సేవల్ని అందించేందుకు ప్రభుత్వ శాఖల్లో అదే స్థాయిలో ఉద్యోగుల సంఖ్య కూడా పెరగాలి. అయితే, అలా జరగడంలేదు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలను ఇస్తామంటూ అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం ఆ హామీకి నీళ్లొదిలేసింది. అంతేనా.. జనాభాకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగుల సంఖ్యను పెంచాల్సింది పోయి.. కొత్త పోస్టులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వకుండా కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన రిక్రూట్మెంట్ చేపడుతూ పరిమిత ఉద్యోగులతోనే ప్రభుత్వ రథాన్ని లాగుతున్నది. ఫలితంగా నిరుద్యోగం తారాస్థాయికి చేరుతున్నది. ‘పే అండ్ అలవెన్స్’ పేరిట కేంద్ర ఆర్థిక శాఖ ఇటీవల విడుదల చేసిన వార్షిక నివేదిక ఈ విషయాన్ని తేటతెల్లం చేస్తున్నది.
ఆర్థిక శాఖ తాజా నివేదిక ప్రకారం.. కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ప్రస్తుతం 30.13 లక్షల మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. 2010 తర్వాత ఉద్యోగుల సంఖ్య ఇంత తక్కువ స్థాయిలో ఉండటం ఇదే తొలిసారి. దేశ జనాభాను బట్టి ప్రభుత్వ శాఖల్లో ప్రస్తుత ఉద్యోగుల సంఖ్యకు కనీసం ఐదారు రెట్ల సంఖ్యలో ఉద్యోగాలను భర్తీ చేయాల్సి ఉన్నది. అయితే, 39.77 లక్షల పోస్టులను మాత్రమే మంజూరు చేసిన బీజేపీ ప్రభుత్వం అందులో 30.13 లక్షల కొలువులనే భర్తీ చేసింది. అంటే, ఇంకా 9.64 లక్షల పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. ఈ లెక్కన కేంద్ర ప్రభుత్వ శాఖల్లోని ప్రతి నాలుగు పోస్టుల్లో ఒక ఉద్యోగం భర్తీకి నోచుకోకుండా ఖాళీగానే ఉన్నది. ఇదే సమయంలో దేశవ్యాప్తంగా చదువుకు తగిన ఉద్యోగం లభించక దాదాపు 22 కోట్ల మంది పడిగాపులు కాస్తున్నట్టు నివేదికలు చెబుతున్నాయి. కేంద్రప్రభుత్వ శాఖల్లో మంజూరైన పోస్టుల సంఖ్యను పెంచి, వాటిని ఎప్పటికప్పుడు భర్తీ చేస్తూ కొత్త ఉద్యోగాలను సృష్టిస్తే దేశంలో నిరుద్యోగం తగ్గుతుందని నిపుణులు సూచిస్తున్నారు.