చండీఘడ్, జనవరి 19: పంజాబ్ సరిహద్దుల్లో నిరసన చేస్తున్న రైతులతో ఫిబ్రవరి 14న కేంద్రం చర్చలు జరపనుంది. కేంద్ర సర్కారు, రైతు సంఘాల నేతలు చర్చలపై ఒక అంగీకారానికి వచ్చారు. కేంద్ర వ్యవసాయ శాఖ సంయుక్త కార్యదర్శి ప్రియ రంజన్ ఎస్కేఎం(రాజకీయేతర), కేఎంఎం సంఘాల నేతలతో శనివారం శంభు సరిహద్దు వద్ద జరిపిన చర్చలు ఫలప్రదం కావడంతో చర్చల తేదీని ఖరారు చేశారు.
55 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న రైతు నేత డల్లేవాల్తో కూడా కేంద్ర బృందం చర్చలు జరిపింది. రైతుల డిమాండ్లపై చర్చలకు కేంద్రం సిద్ధంగా ఉందని వారు తెలపడం, రైతు నేతలు పదే పదే విజ్ఞప్తి చేయడంతో వైద్య చికిత్సకు ఆయన ఎట్టకేలకు అంగీకరించారు. కేంద్రంతో జరిగే చర్చల్లో డల్లేవాల్ పాల్గొనే అవకాశం ఉంది. జనవరి 26న ఢిల్లీ దిశగా తాము నిర్వహించాలనుకున్న కవాతులో ఎలాంటి మార్పు ఉండదని రైతు నేతలు స్పష్టం చేశారు.