న్యూఢిల్లీ: గ్యాస్ సిలిండర్ల సరఫరాలో ఎదుర్కొన్న నష్టాలు పూడ్చుకునేందుకు మూడు ప్రధాన చమురు సంస్థలకు కేంద్ర ప్రభుత్వం రూ.22,000 కోట్ల గ్రాంట్ ప్రకటించింది. బుధవారం జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. రెండేళ్ల నష్టాల భర్తీ కోసం ప్రభుత్వ రంగ చమురు సంస్థలైన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ), భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్), హిందూస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెప్పీసీఎల్)కు ఒక్కసారికి గాను రూ.22,000 కోట్ల నిధులు ఇవ్వనున్నట్లు చెప్పారు. 2020 జూన్ నుంచి 2022 జూలై కాలానికి ఎల్పీజీ సిలిండర్ల అమ్మకాల వల్ల వాటిల్లిన నష్టాలు అదిగమించేందుకు ఈ గ్రాంటు సహకరిస్తుందని అన్నారు.
కాగా, ఈ కాలంలో అంతర్జాతీయ మార్కెట్లో ఎల్పీజీ ధరలు 300 శాతం పెరిగినట్లు కేంద్రం తెలిపింది. అయితే దేశంలో ఎల్పీజీ వినియోగదారులపై ఆ మొత్తం భారం పడకుండా కేవలం 72 శాతం ధరలను మాత్రమే చమురు సంస్థలు పెంచాయని పేర్కొంది. మిగతా నష్టాన్ని చమురు సంస్థలు భరించాయని, ఎలాంటి ఆటంకాలు లేకుండా ఎల్పీజీ సిలిండర్ల సరఫరాను వినియోగదారులకు కొనసాగించాయని వెల్లడించింది. ఈ నేపథ్యంలో రెండేళ్ల కాలంలో ఎదుర్కొన్న నష్టాలను పూడ్చుకునేందుకు మూడు ప్రభుత్వ రంగ చమురు సంస్థలకు రూ.22,000 కోట్ల గ్రాంట్‌కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిందని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ వెల్లడించారు.