(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, జూన్ 18 (నమస్తే తెలంగాణ) : దేశంలో కొత్త ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం నిరుడు ‘ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్‌గార్ యోజన (పీఎం-వీబీఆర్‌వై)’ పథకానికి శ్రీకారం చుట్టింది. ఈ పథకం కింద 15 లక్షల మంది లబ్ధిదారుల ఖాతాల్లో రూ. 2,400 కోట్లను కేంద్రం శుక్రవారం జమ చేయనున్నది. ఢిల్లీలోని విజ్ఞాన్‌భవన్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతులమీదుగా ఈ కార్యక్రమం జరుగనున్నది. తొలిసారి ఉద్యోగంలో చేరి ఈపీఎఫ్‌వో ఉన్నవారికి నెల వేతనం లేదా గరిష్ఠంగా రూ. 15 వేల వరకూ, యాజమాన్యానికి రూ. 3 వేల వరకూ ‘పీఎం-వీబీఆర్‌వై’ కింద ప్రభుత్వం ప్రోత్సాహకం ఇస్తున్నది.
తెలంగాణలోని హైదరాబాద్, సంగారెడ్డి, కరీంనగర్, నిజామాబాద్, హనుమకొండలో కూడా శుక్రవారం పీఎం-వీబీఆర్‌వై కార్యక్రమాలు జరుగుతాయని, హైదరాబాద్‌లోని ఆర్టీసీ కళాభవన్‌లో జరిగే ఈవెంట్లో కేంద్రమంత్రి జీ కిషన్‌రెడ్డి సహా రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో పాటు ప్రభుత్వ ఉన్నతాధికారులు, ఉద్యోగులు, కంపెనీల యాజమాన్యాల ప్రతినిధులు పాల్గొంటారని కేంద్ర కార్మిక మంత్రిత్వశాఖ తెలిపింది. పీఎం-వీబీఆర్‌వై పథకం కింద శుక్రవారం తెలంగాణలోని 57,544 మంది ఉద్యోగుల ఖాతాల్లో రూ. 30.72 కోట్లు, 3,674 కంపెనీల యాజమాన్యాల ఖాతాల్లో రూ. 105 కోట్లు జమ కాబోతున్నట్టు వివరించింది.
2027 జూలై 31నాటికి దేశవ్యాప్తంగా కొత్తగా 3.5 కోట్లకు పైగా ఉద్యోగాలను కల్పించాలన్న లక్ష్యంతో పీఎం-వీబీఆర్‌వై పథకాన్ని తీసుకొచ్చారు. ఉద్యోగికి, యాజమాన్యాలకు ప్రోత్సాహకాలు ఇస్తూ.. తద్వారా ఉపాధి కల్పనను పెంచడమే ఈ పథకం లక్ష్యమని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. పీఎం-వీబీఆర్‌వై స్కీమ్‌ను పార్ట్-ఏ, పార్ట్-బీ అని రెండు భాగాలుగా విభజించారు. పార్ట్-ఏ కింద తొలిసారి ఉద్యోగంలో చేరిన వారికి ప్రోత్సాహకాలు లభిస్తాయి. అంటే సగటున ఒక నెల జీతం లేదా గరిష్ఠంగా రూ. 15 వేల వరకూ అందుతుంది. ఇది రెండు విడుతల్లో డైరెక్టుగా ఉద్యోగి ఖాతాలో జమ చేస్తారు. రూ. లక్ష వరకూ గ్రాస్ వేతనం పొందే ఉద్యోగులు అందరూ పార్ట్-ఏ కిందికి వస్తారు. ఇక పార్ట్-బీ కింద యజమానులకు ఆర్థిక ప్రోత్సాహకాలు అందిస్తారు. ఉద్యోగి నెల జీతం రూ. 10 వేలు అయితే, యజమానికి రూ. వెయ్యి ప్రోత్సాహకం అందుతుంది. అలాగే ఉద్యోగి నెల జీతం రూ. 10-20 వేల మధ్య ఉంటే యజమానికి రూ. 2 వేలు, అలాగే ఉద్యోగి నెల జీతం రూ. 20-30 వేల మధ్య ఉంటే యజమానికి రూ.3 వేలు ఇస్తారు. ఇది ఒక ఉద్యోగికి ఒకసారి మాత్రమే వర్తిస్తుంది. ఉద్యోగి కనీసం ఆరు నెలలు కొనసాగితేనే, అటు ఉద్యోగికి, ఇటు యాజమాన్యానికి ఈ స్కీమ్ వర్తిస్తుంది.
పీఎం-వీబీఆర్‌వై స్కీమ్ కింద గత మార్చిలో తొలిదఫాలో నిధులు విడుదల చేశారు. 4.41 లక్షల మంది ఉద్యోగుల ఖాతాల్లో రూ. 247 కోట్లు, 17,551 కంపెనీల ఖాతాల్లో రూ. 214 కోట్లను జమ చేశారు. తొలి దఫా నిధుల విడుదల సమయానికి 6.46 లక్షల మంది కొత్తగా ఉద్యోగాలు సాధించినట్టు ప్రభుత్వవర్గాలు పేర్కొన్నాయి. ప్రస్తుతం ఈ సంఖ్య 15 లక్షలకు పెరిగినట్టు అంచనా వేశాయి.