Justice Sanjiv Khanna | భారత సుప్రీంకోర్టు తర్వాతి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ కన్నా నియామకమయ్యారు. ప్రస్తుతం సీజేఐగా జస్టిస్ డీవై చంద్రచూడ్ కొనసాగుతున్నారు. ఆయన నవంబర్ 10న పదవీ విరమణ చేయనున్నారు. ఈ క్రమంలో ఇటీవల ఆయన తర్వాతి సీజేఐగా సంజీవ్ కన్నా పేరును ప్రతిపాదిస్తూ సిఫారసు చేశారు. ఈ క్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలుపడంతో జస్టిస్ ఖన్నా నియామకాన్ని కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసింది. సీజేఐగా జస్టిస్ ఖన్నా పదవీకాలం నవంబర్ 11 నుంచి అమలులోకి వస్తుందని కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ తెలిపారు. అదే రోజున ఆయన భారతదేశ 51వ ప్రధాన న్యాయమూర్తిగా పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఆయన 2025 మే 13 వరకు అంటే దాదాపు ఏడునెలలు సీజేఐగా కొనసాగనున్నారు. ప్రస్తుతం సుప్రీంకోర్టులో సీజేఐ డీవై చంద్రచూడ్ తర్వాత రెండో సీనియర్ న్యాయమూర్తి ఆయననే. ఇటీవల ఆయన పేరును సిఫారసు చేస్తూ కేంద్రానికి లేఖ రాశారు.
జస్టిస్ కన్నా జనవరి 18, 2019న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. అంతకు ముందు ఢిల్లీ హైకోర్టులో న్యాయమూర్తిగా పని చేశారు. జస్టిస్ ఖన్నా మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ హన్సరాజ్ ఖన్నా మేనల్లుడు. జస్టిస్ సంజీవ్ ఖన్నా 14 మే 1960న జన్మించారు. ఆయన తండ్రి దేవరాజ్ ఖన్నా సైతం ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా పదవీ విరమణ చేయడం విశేషం. ఆయన తల్లి సరోజ్ ఖన్నా ఎల్ఎస్ఆర్ డీయూలో లెక్చరర్‌గా సేవలందించారు. ఆయన ఢిల్లీ యూనివర్సిటీలోని క్యాంపస్ లా సెంటర్లో న్యాయశాస్త్రం అభ్యసించారు. గ్రాడ్యుయేషన్ తర్వాత 1983లో బార్ కౌన్సిల్ ఆఫ్ ఢిల్లీలో న్యాయవాదిగా నమోదు చేసుకున్నారు. కెరీర్ ప్రారంభంలో ఢిల్లీలోని తీస్ హజారీ క్యాంపస్‌లో ప్రాక్టీస్ ప్రారంభించారు. ఆ తర్వాత ఢిల్లీ హైకోర్టులో వివిధ రంగాల్లో ప్రాక్టీస్ చేశారు. 2005లో ఢిల్లీ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా.. ఆ తర్వాత 2006లో శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2006 నుంచి 2019 వరకు హైకోర్టులో న్యాయమూర్తిగా పని చేశారు. జనవరి 18, 2019న భారత సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. జస్టిస్ ఖన్నా 2019లో రాజ్యాంగ ధర్మాసనం తరఫున ప్రధాన తీర్పును వెలువరించారు. సీజేఐ కార్యాలయానికి సైతం ఆర్టీఐ చట్టం వర్తిస్తుందని తెలిపారు. అమిష్ దేవగన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాలో జస్టిస్ సంజీవ్ ఖన్నా తీర్పు విద్వేషపూరిత ప్రసంగాలను నియంత్రించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పడం గమనార్హం.
2021లో సెంట్రల్ విస్టా ప్రాజెక్టు అవసరమైన ప్రక్రియలను పాటించలేదంటూ తప్పుపట్టారు. ముగ్గురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనంలో మరో ఇద్దరు న్యాయమూర్తులతో వ్యతిరేకిస్తూ తీర్పు చెప్పారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, సంజయ్ సింగ్ బెయిల్ దరఖాస్తులకు సంబంధించి రాజకీయంగా సున్నితమైన అంశాలపై విచారణ జరిపారు. 2023లో మనీష్ సిసోడియాకు బెయిల్ నిరాకరించినప్పటికీ విచారణను త్వరగా పూర్తి చేయాలని బెంచ్ ఆదేశించింది. సంజయ్ సింగ్ కేసులో జస్టిస్ ఖన్నా బెంచ్ నుంచి పలు కీలమైన ప్రశ్నలు ఎదుర్కొన అనంతరం ఈడీ బెయిల్‌కు అంగీకారం తెలిపింది. ఈ ఏడాది మేలో జస్టిస్ ఖన్నా ధర్మాసనం ఎన్నికల ప్రచారం నిమిత్తం అప్పటి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్‌ను మంజూరు చేసింది. జూలైలో జస్టిస్ ఖన్నా ధర్మాసనం కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. చట్టాన్ని దుర్వినియోగం చేయకుండా నిరోధించేందుకు పీఎంఎల్ఏ కింద అరెస్టు చేయడానికి మరిన్ని కారణాలను చేర్చాల్సిన అవసరాన్ని పరిశీలించేందుకు ఈ అంశాన్ని బెంచ్‌కు సిఫారసు చేశారు. ఆయన నేతృత్వంలోని ధర్మాసనం ఈవీఎం-వీవీపీఏటీ వ్యవహారంపై కూడా విచారణ జరిపింది. ఆర్టికల్ 370తో పాటు ఎలక్టోరల్ బాండ్స్ కేసులకు సంబంధించిన రాజ్యాంగ ధర్మాసనంలోనూ ఆయన ఒకరు.