న్యూఢిల్లీ : నిత్యావసరాల ధరలు మోతెక్కి సామాన్యుడిపై పెనుభారం పడుతుండటంతో ద్రవ్యోల్బణానికి కళ్లెం వేసేందుకు కేంద్రం కసరత్తు సాగిస్తోంది. మరికొద్ది నెలల్లో కీలక రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ముంచుకొస్తుండటం, ధరల మంటపై విపక్షాల నుంచి విమర్శలు వెల్లువెత్తడంతో ధరలకు చెక్ పెట్టకతప్పదని భావిస్తోంది.
ఇంధన ధరలపై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించిన తరహాలో వంటనూనెలపై కస్టమ్స్ సుంకాలను తగ్గించే దిశగా కేంద్రం యోచిస్తోంది. వంటనూనెలతో పాటు పరిశ్రమలకు అవసరమైన ముడి పదార్ధాపై కస్టమ్స్ సుంకాల్లో కోత విధించాలని భావిస్తోంది. కొన్ని దిగుమతులపై విధిస్తున్న వ్యవసాయ మౌలికవసతుల అభివృద్ధి సెస్‌ను తగ్గించడంపైనా చర్చలు సాగిస్తోంది.
ద్రవ్య లభ్యత తగ్గడం, వడ్డీ రేట్ల పెరుగుదలతో ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ద్రవ్యోల్బణానికి చెక్ పెట్టేందుకు ఎలాంటి చర్యలు చేపట్టాలనే దానిపై ప్రధాని కార్యాలయం (పీఎంఓ), ఆర్ధిక మంత్రిత్వ శాఖలు గతవారం చర్చలు జరిపాయి. ఆహార పదార్ధాల ధరలు పెరగడంతో రిటైల్ ద్రవ్యోల్బణం ఎనిమిదేండ్ల గరిష్టస్ధాయిలో ఏప్రిల్‌లో 7.79 శాతానికి ఎగబాకింది.