న్యూఢిల్లీ, డిసెంబర్ 3: దేశంలో ‘ఒమిక్రాన్’ కేసులు తాజాగా వెలుగుచూడటంతో కొత్త వేరియంట్‌పై ప్రజల్లో భయాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో ‘ఒమిక్రాన్’కు సంబంధించి కేంద్ర ఆరోగ్య శాఖ శుక్రవారం కొన్ని ముఖ్యమైన సందేహాలకు సమాధానాలనిచ్చింది.
ఒమిక్రాన్ కారణంగా దేశంలో థర్డ్‌వేవ్ వచ్చే ప్రమాదమున్నదా?
ఒమిక్రాన్ తీవ్రతపై ఇప్పటివరకైతే స్పష్టమైన సమాచారం లేదు. అయితే, దేశంలో ఇప్పటికే చాలామంది టీకా వేసుకున్నారు. ‘డెల్టా’ కారణంగా పలువురు రోగనిరోధకశక్తిని వృద్ధి చేసుకున్నారు. ఈ కారణాల వల్ల ఒమిక్రాన్ తీవ్రత దేశంలో తక్కువగానే ఉండొచ్చు. అయితే, దీనిపై శాస్త్రీయ ఆధారాలను విశ్లేషించాల్సి ఉన్నది.
అందుబాటులో ఉన్న టీకాలు ‘ఒమిక్రాన్’పై పనిచేస్తాయా?
‘ప్రస్తుత టీకాలు ఒమిక్రాన్‌పై పనిచేయవు’ అనడానికి ఎలాంటి ఆధారాలు లేవు. తీవ్రమైన వ్యాధుల నుంచి రక్షణ పొందాలంటే టీకా తప్పకుండా వేసుకోవాలి.
ఒమిక్రాన్‌ను ఎలా గుర్తిస్తున్నారు?
ఆర్టీ-పీసీఆర్ పరీక్ష అనంతరం ఆ ఫలితాలను ఇన్సాకాగ్కు పంపించి వేరియంట్‌ను నిర్ధారిస్తున్నారు.
‘ఒమిక్రాన్’పై ఆందోళన అవసరమా?
వేరియంట్ వ్యాప్తి, మ్యూటేషన్లను బట్టి ‘ఒమిక్రాన్’ను ఆందోళన కలిగించే రకం జాబితాలో డబ్ల్యూహెచ్‌వో చేర్చింది. ఈ వేరియంట్‌ను అశ్రద్ధ చేస్తూ బాధ్యతారాహిత్యంతో ఉండొద్దు. కొవిడ్ నియమాలు పాటిస్తే ముప్పును తప్పించుకోవచ్చు.
వేరియంట్ వ్యాపించకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు?
ముఖానికి మాస్కు, రెండు డోసుల టీకా, భౌతిక దూరం, గదిలో మంచి వెంటిలేషన్.