న్యూఢిల్లీ, సెప్టెంబర్ 30 : గోధుమల మద్దతు ధరను కేంద్రం పెంచింది. 2027-28 రబీ మార్కెటింగ్ సంవత్సరానికి రూ.25 పెంచడంతో క్వింటాల్ ధర రూ.2,615కు చేరుకుంది. అలాగే పప్పు ధాన్యాలు, నూనెగింజల ధరలను కూడా క్వింటాల్‌కు రూ.675 వరకు పెంచింది. 2026-27 రబీ మార్కెటింగ్ సంవత్సరం (ఏప్రిల్ నుంచి మార్చి వరకు) గోధుమల క్వింటాల్ ధర రూ.2,585గా ఉంది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ సమావేశంలో గోధుమలు, మరో ఐదు రబీ పంటలపై మద్దతు ధరను పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.
అలాగే ఢిల్లీలో ఇంటెలిజెన్స్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్‌కు ఆమోదం తెలిపింది. దేశ రాజధాని ఢిల్లీలో ట్రాఫిక్ వ్యవస్థను మెరుగుపర్చడానికి రూ.1,789.52 కోట్ల అంచనాతో ఈ ప్రాజెక్టును చేపట్టనున్నట్టు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ చెప్పారు. రియట్-టైమ్ ట్రాఫిక్ డాటా, అడాప్టివ్ ట్రాఫిక్ సిగ్నళ్లు, ఆటోమేటెడ్ ఎన్ఫోర్స్మెంట్ ద్వారా ఢిల్లీలోని ప్రస్తుత రహదారి నెట్‌వర్క్‌ను మరింత సమర్థంగా నిర్వహించడానికి ఈ ప్రాజెక్టు దోహదం చేస్తుందని ఆయన చెప్పారు.
