న్యూఢిల్లీ : తాలిబన్ల ఆక్రమణతో ఆప్ఘనిస్ధాన్లో తలెత్తిన సంక్షోభంపై చర్చించేందుకు ఆగస్ట్ 26న కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసింది. ఆప్ఘన్లో చోటుచేసుకున్న పరిణామాలను రాజకీయ పార్టీల నేతలకు వివరించాలని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖను ప్రధాని నరేంద్ర మోదీ కోరారని అంతకుముందు విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ట్వీట్ చేశారు. అఖిలపక్ష భేటీలో ఆప్ఘన్ నుంచి భారతీయులను ఖాళీ చేయించడంతో పాటు ఆప్ఘనిస్ధాన్లో పరిస్ధితిని భారత్ ఎప్పటికప్పుడు మదింపు చేస్తున్న తీరును ప్రభుత్వం విపక్ష నేతలకు వివరించనుంది.
ఆప్ఘన్లో అమెరికన్ దళాల ఉపసంహరణతో రాజధాని కాబూల్ సహా ఆప్ఘన్లోని అన్ని పట్టణాలు, నగరాలను తాలిబన్లు తమ స్వాధీనంలోకి తీసుకున్న సంగతి తెలిసిందే. కాబూల్ తాలిబన్ల వశం కావడంతో ఆప్ఘన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ అధ్యక్ష భవనం నుంచి పారిపోయారు. మరోవైపు ఆప్ఘన్ సంక్షోభం నేపధ్యంలో ప్రభుత్వం ఇప్పటికే 730 మందిని ఆ దేశం నుంచి భారత్కు తీసుకువచ్చింది.