iPhone | న్యూఢిల్లీ: ఆపిల్ ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఐఫోన్ 16 సిరీస్ లాంచ్ అయింది. అభిమానులు ఎప్పట్లానే ఎగబడి వాటిని కొనుగోలు చేశారు. మిగతా కంపెనీల ఉత్పత్తులతో పోలిస్తే భద్రత పరంగా ఇవి అత్యుత్తమమైనవిగా భావిస్తారు. అందుకే ఖర్చుతో సంబంధం లేకుండా వాటిని సొంతం చేసుకునేందుకు ఇష్టపడతారు. అయితే, అవి కూడా అంత సురక్షితం ఏమీ కాదని, వాటిలోనూ బోల్డన్ని భద్రతా లోపాలు ఉన్నట్టు కేంద్రం తెలిపింది.
ఈ మేరకు ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (సీఈఆర్టీ-ఇన్) హై రిస్క్ వార్నింగ్ జారీ చేసింది. ఐవోఎస్, ఐపాడ్ ఓఎస్, మ్యాక్ఓఎస్, వాచ్ఓఎస్, విజన్ ఓఎస్‌లలో భద్రతా పరమైన లోపాలు ఉన్నట్టు పేర్కొంది. ఫలితంగా ప్రభావితమయ్యే వాటిలో ఐవోస్ 18, 17.7కు ముందు వెర్షన్లు, ఐపాడ్ఓఎస్లో 18, 17.7, మ్యాక్ఓఎస్ సోనోమాలో 14.7, మ్యాక్ఓఎస్ వెంచురాలో 13.7, మ్యాక్ ఓఎస్ సీక్వోయాలో 15, టీవీఓఎస్లో 18, వాచ్ ఓఎస్‌లో 11, సపారీలో 18, ఎక్స్కోడ్లో 16, విజన్ ఓఎస్‌లో 2కు ముందు వెర్షన్లు ఉన్నాయి. వీటికి హ్యాకింగ్ ముప్పు పొంచి ఉన్నదని, కాబట్టి వీలైనంత త్వరగా తాజా సాఫ్ట్వేర్ వెర్షన్లతో అప్డేట్ చేసుకోవాలని సీఈఆర్టీ కోరింది.