జబల్పూర్: భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి 79 ఏండ్లు గడచినప్పటికీ ఇంకా లక్షలాది మంది ప్రజలు విద్యుత్తు సదుపాయానికి నోచుకోని దుస్థితిలో ఉన్నారు. పార్లమెంట్లో గిరిజన మంత్రిత్వశాఖ విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం బీజేపీ పాలిత మధ్యప్రదేశ్లో 55,795 గిరిజన కుటుంబాలు ఇప్పటికీ విద్యుత్తు సదుపాయం లేకుండా కాలం వెళ్లదీస్తున్నాయి. కాగా గిరిజన ప్రాంతాల్లో మౌలిక వసతుల కొరతను సరిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక సంక్షేమ కార్యక్రమాన్ని ప్రారంభించింది. 2026, జూలై 30 నాటి గణాంకాల ప్రకారం మధ్యప్రదేశ్లో సుమారు 18.57 లక్షల గిరిజన కుటుంబాలు ఈ కార్యక్రమం కింద లబ్ధి పొందుతున్నాయి. అయినా వీరి గృహాలలో చాలావరకు విద్యుత్తు కనెక్షన్లు, తాగునీరు, మరుగుదొడ్లు వంటి ప్రాథమిక సౌకర్యాలు లేవు. ఈ సౌకర్యాలను కల్పించే బాధ్యతను వివిధ ప్రభుత్వ శాఖలకు కేటాయించారు.
ఈ పథకం అమలు తీరుపై మధ్యప్రదేశ్ రాజ్యసభ ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. గిరిజన వ్యవహారాలశాఖ సహాయ మంత్రి దుర్గాదాస్ ఉయికే విద్యుత్తు సదుపాయాల కల్పన లోటును అంగీకరించారు. 2025, మార్చి 20న మధ్యప్రదేశ్ అసెంబ్లీలో ఇంధనశాఖ గ్రాంట్ల డిమాండ్లపై జరిగిన చర్చలో ఆ మంత్రి ప్రద్యుమన్ సింగ్ తోమర్ మాట్లాడుతూ సంబంధిత విద్యుత్తు పథకం కింద ఇప్పటికే దాదాపు 27,000 ఇండ్లకు విద్యుత్తు కనెక్షన్లు ఇచ్చినట్లు తెలిపారు.
2025 ఫిబ్రవరి నాటికి విద్యుత్తు పంపిణీ సంస్థలు సుమారు 16,745 గృహాలకు కనెక్షన్లు అందించాయి. ధర్తీ అబా ప్రచారం కింద విద్యుదీకరణ అవసరమైన 11,377 గిరిజన ప్రాంతాల్లోని గృహాలను గుర్తించేందుకు సర్వే కూడా కొనసాగుతున్నది. సిద్ది, సింగ్రోలి జిల్లాలలో 16,302 గృహాలకు విద్యుత్తు సౌకర్యం లేదు. మధ్యప్రదేశ్ విద్యుత్తుశాఖ ప్రధాన కార్యాలయమైన ‘శక్తి భవన్’ జబల్పూర్లోనే ఉంది. అయినప్పటికీ ఈ జిల్లాలో ఇంకా పూర్తిస్థాయి గృహవిద్యుదీకరణ జరుగలేదని గణాంకాలు చెబుతున్నాయి.