న్యూఢిల్లీ: దేశంలోని ఎన్జీవోలు విదేశీ నిధులను అందుకునే, వినియోగించే విధానానికి సంబంధించి కేంద్రం నిబంధనలను కఠినం చేసింది. దీనిలో భాగంగా ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ రూల్స్ 2011కు పలు సవరణలు చేస్తూ, కేంద్ర హోం శాఖ ఒక గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. సవరించిన నిబంధనలు ప్రకారం భారతీయ సంతతికి చెందిన వారు మినహా, ఇతర విదేశీ పౌరులు ఎవరైనా ఒక అసోసియేషన్‌లో కీలక నిర్వాహకులుగా ఉంటే, అలాంటి సంస్థలకు విదేశీ నిధులు పొందేందుకు రిజిస్ట్రేషన్ లేదా ముందస్తు అనుమతి లభించదు. అయితే కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ఆర్డర్ ద్వారా కొన్ని నిర్దిష్ట పరిస్థితుల్లో మాత్రమే విదేశీ పౌరులు కీలక నిర్వాహకులుగా ఉండేందుకు అనుమతినిస్తుంది.
ఇకపై విదేశీ నిధుల కోసం దరఖాస్తు చేసుకునే ఎన్జీవోలు తాము ఏ నిర్దిష్ట ప్రయోజనం కోసం ఏ ప్రాంతంలో పనిచేయానుకుంటున్నారో కచ్చితంగా తెలియజేయాల్సి ఉంటుంది. తాజాగా మతపరమైన విభాగంలో ప్రార్థనా స్థలాల నిర్మాణం, నిర్వహణ, పునరుద్ధరణ, మతపరమైన విద్య, భక్తిసంగీత ప్రచారం వంటి వివిధ కార్యకలాపాలను చేర్చారు. వీటిలో మత మార్పిళ్లకు తావుండకూడదని కేంద్ర స్పష్టంగా పేర్కొన్నది. ఏదైనా ఎన్జీవో తన రిజిస్ట్రేషన్‌ను పునరుద్ధ్దరించుకోవాలంటే గత రెండు ఆర్థిక సంవత్సరాల్లో కనీసం గరిష్ఠంగా రూ. 10 లక్షల విదేశీ విరాళాలను ఖర్చు చేసి ఉండాలి.