న్యూఢిల్లీ, జూలై 20: కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో 2021, మార్చి 1 నాటికి 9.79 లక్షల ఉద్యోగ ఖాళీలు ఉన్నాయని కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ మంత్రి జితేంద్ర సింగ్ బుధవారం పార్లమెంట్‌కు తెలిపారు. ఈ మేరకు జితేంద్ర సింగ్ లోక్‌సభలో ఓ ప్రశ్నకు రాతపూర్వక సమాధానం ఇచ్చారు. కేంద్ర విభాగాల్లో మొత్తం మంజూరు పోస్టులు సంఖ్య 40.35 లక్షలు కాగా, వాటిలో 9.79 లక్షలు ఖాళీగా ఉన్నాయంటే.. నాలుగింట ఒక పోస్టు భర్తీకి నోచుకోలేదు. పోస్టుల కల్పన, భర్తీ ప్రక్రియ అనేది సంబంధిత మంత్రిత్వ శాఖ బాధ్యత అని, ఇది నిరంతర ప్రక్రియని మంత్రి చెప్పారు.
పదవీ విరమణలు, ప్రమోషన్లు, రాజీనామాలు, మరణాలు తదితర కారణాల వలన కేంద్ర ప్రభుత్వ పలు విభాగాల్లో ఉద్యోగ ఖాళీలు ఏర్పడ్డాయని చెప్పుకొచ్చారు. ఖాళీలను భర్తీ చేసేందుకు కాలపరిమితితో యుద్ధ ప్రాతిపదికన తగిన చర్యలు తీసుకోవాలని ఆయా విభాగాలను కోరామని పేర్కొన్నారు. ఉద్యోగాల కోసం దేశంలోని కోట్ల మంది నిరుద్యోగులు ఎదురుచూస్తున్నా కేంద్రప్రభుత్వానికి చీమకుట్టినట్టు కూడా లేదని ఈ జవాబుతో స్పష్టమైంది.
ఉద్యోగాల కోసం ఎదురుచూడకుండా పకోడీలు వేసి సైతం బాగా సంపాదించవచ్చని ఇప్పటికే ప్రధాని మోదీ సెలవిచ్చారు. అదే మాటలపై నిలబడి ఉద్యోగాలు భర్తీ చేయడం లేదోమోనని నిరుద్యోగ యువత విమర్శిస్తున్నది. మరోవైపు దేశ భవిష్యత్తుకు ఎంతో కీలకమైన సెంట్రల్ యూనివర్సిటీల్లో అధ్యాపకుల కొరత వేధిస్తున్నది. 43 సెంట్రల్ వర్సిటీల్లో 6,549 ఫ్యాకల్టీ పోస్టులు ఖాళీగా ఉన్నాయని కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖనే తాజాగా లోక్‌సభలో పేర్కొన్నది. వీటిలో ఎస్సీ కోటా-988, ఎస్టీ-576, ఓబీసీ-1,761 ఉన్నాయి. ఢిల్లీ యూనివర్సిటీ(డీయూ)లో అత్యధికంగా దాదాపు 900 అధ్యాపకుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
డీయూలో 52 మంది టీచర్లు అడ్‌హక్ పద్ధతిలో పనిచేస్తున్నారని, వీరితో పాటు 248 మంది గెస్టు టీచర్లు, కాంట్రాక్టు కింద 1,044 మంది ఉన్నారని మంత్రిత్వ శాఖ తన రాతపూర్వక సమాధానంలో చెప్పింది. ఖాళీల విషయంలో డీయూ తర్వాత యూనివర్సిటీ ఆఫ్ అలహాబాద్(622), బనారస్ హిందూ యూనివర్సిటీ(326), అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ(498), జేఎన్‌యూ(326) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.