ఒమిక్రాన్ కేసులు చాపకింద నీరులా విస్తరిస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. ఒమిక్రాన్ కేసులను తగ్గించి, వ్యాక్సినేషన్‌ను పెంచాలన్న దృఢ సంకల్పంతో ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగా ఒమిక్రాన్, కరోనా కేసులు అధికంగా ఉన్న రాష్ట్రాలు, వ్యాక్సినేషన్ తక్కువగా అయిన రాష్ట్రాలపై ముఖ్యంగా కేంద్రం దృష్టి సారిస్తోంది. ఈ కోవలో కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు, బెంగాల్, మిజోరాం, కర్నాటక, బిహార్, జార్ఖండ్, పంజాబ్, యూపీ… ఈ రాష్ట్రాలపై కేంద్రం ముఖ్యంగా దృష్టి సారించింది. ఈ రాష్ట్రాలకు కేంద్రం ఓ అధికార బృందాన్ని కూడా పంపనుంది. వీరు ఆ రాష్ట్రాల్లోని పరిస్థితులను క్షుణ్ణంగా అధ్యయనం చేస్తారని సమాచారం. ఎన్నికలు జరిగే పంజాబ్, యూపీపై మరింత దృష్టి సారించాలని కేంద్రం నిర్ణయించింది. సోమవారం కేంద్ర ఆరోగ్య శాఖ్య కార్యదర్శి రాజేశ్ భూషణ్ యూపీ, పంజాబ్ నేతలతో ఓ కీలక సమావేశం కూడా నిర్వహించనున్నారు.
కేంద్ర అధికారుల బృందం ఐదు రోజుల పాటు ఈ రాష్ట్రాల్లో పర్యటించనుంది. అక్కడే బస చేస్తూ… అక్కడి ఆరోగ్య శాఖ అధికారులతో భేటీలు నిర్వహించనుంది. ఆ రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్ జరుగుతున్న తీరు, ఆస్పత్రుల మౌలిక సదుపాయాలు, కేసుల పెరుగుదల… ఇలా కొన్ని అంశాలపై క్షుణ్ణంగా అధ్యయనం చేస్తారని కేంద్ర వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ కేంద్ర బృందాలు ఆయా రాష్ట్రాల్లోని పరిస్థితులను సమీక్షించి ప్రతి రోజూ సాయంత్రం రాష్ట్ర అధికారులకు ఓ నివేదిక కూడా సమర్పిస్తుందని కేంద్ర ఆరోగ్య శాఖ వర్గాలు పేర్కొన్నాయి.