న్యూఢిల్లీ: సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) కానిస్టేబుల్ నియామకాల్లో మాజీ అగ్నివీర్లకు రిజర్వేషన్లను కేంద్ర ప్రభుత్వం 10 శాతం నుంచి 50 శాతానికి పెంచింది. ఈ మేరకు బీఎస్ఎఫ్ నిబంధనలను సవరిస్తూ కేంద్ర హోం శాఖ శుక్రవారం ఓ నోటిఫికేషన్ను జారీ చేసింది. దీని ప్రకారం, మాజీ అగ్నివీర్ల కోసం కేటాయించిన 50 శాతం ఖాళీలను నోడల్ ఫోర్స్ మొదటి దశలో భర్తీ చేస్తుంది. రెండో దశలో, మిగిలిన 47 శాతం ఖాళీలను స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ భర్తీ చేస్తుంది. ఈ ఖాళీల్లో మాజీ సైనికుల కోటా 10 శాతం, మొదటి దశలో మాజీ అగ్నివీర్లతో భర్తీ కాని పోస్ట్లు కూడా ఉంటాయి.
మహిళా అభ్యర్థుల కోసం ఖాళీలను అంతకు ముందు సంవత్సరంలో పరిస్థితిని బట్టి ప్రతి సంవత్సరం బీఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్ నిర్ణయిస్తారు. కార్యకలాపాల అవసరాల ప్రాతిపదికపై ఈ నిర్ణయం జరుగుతుంది. గతంలో అన్ని సెంట్రల్ ఆర్మ్డ్ ఫోర్సెస్లోనూ కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) ఉద్యోగాల ఖాళీల్లో 10 శాతం మాజీ అగ్నివీర్లకు కేటాయించారు. తాజా నోటిఫికేషన్ కేవలం బీఎస్ఎఫ్ నిబంధనల సవరణలకు మాత్రమే వర్తిస్తుంది. ఇతర కేంద్ర సాయుధ పోలీసు దళాలకు వర్తించదు. ప్రస్తుత నిబంధనల ప్రకారం మాజీ అగ్నివీర్లు శారీరక సామర్థ్య పరీక్షల నుంచి మినహాయింపు పొందుతారు. రాత పరీక్షలో ఉత్తీర్ణులు కావాల్సి ఉంటుంది.