న్యూఢిల్లీ/ హైదరాబాద్, సెప్టెంబర్ 4 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని విద్యాసంస్థలు 2025 నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్ (ఎన్ఐఆర్ఎఫ్) ర్యాంకింగ్‌లలో మిశ్రమ ప్రదర్శన కనబరిచాయి. ఉస్మానియా యూనివర్సిటీ గణనీయమైన పురోగతి సాధించగా, నిట్-వరంగల్, హైదరాబాద్ యూనివర్సిటీ మాత్రం ఓవరాల్ క్యాటగిరీ ర్యాంకింగ్‌లో వెనుకబడ్డాయి. ఈ ర్యాంకింగ్‌లను కేంద్ర ప్రభుత్వం గురువారం విడుదల చేసింది.
ఉస్మానియా యూనివర్సిటీ 2024లో 70వ ర్యాంక్ నుంచి 2025లో 53వ ర్యాంక్‌కు ఎగబాకింది. యూనివర్సిటీ విభాగంలో ఓయూ 2024లో 43వ స్థానం నుంచి 30వ స్థానానికి మెరుగైంది. రాష్ట్ర పబ్లిక్ వర్సిటీల విభాగంలో దాని ర్యాంక్ 2024లో 6వ స్థానం నుంచి 2025లో 7వ స్థానానికి పడిపోయింది. నిట్ వరంగల్ ర్యాంక్ 2024లో 53వ స్థానం నుంచి 63వ స్థానానికి పడిపోగా, హెచ్‌సీయూ ఓవరాల్ విభాగంలో ఒక స్థానం కోల్పోయి 26వ ర్యాంక్‌కు చేరింది. ఐఐటీ -హైదరాబాద్ 12వ ర్యాంక్ నిలబెట్టుకున్నది.
ఓవరాల్ ర్యాంకింగ్స్‌లో ఐఐటీ-మద్రాస్ వరుసగా ఏడోసారి మొదటి స్థానంలో నిలిచింది. తర్వాత ఐఐఎస్సీ, ఐఐటీ బాంబే రెండు, మూడు స్థానాలను దకించుకున్నాయి. ఈ ఏడాది ట్రిఫుల్ఐటీ -హైదరాబాద్ ఓవరాల్ ర్యాంకింగ్ విభాగంలో 74వ స్థానం సాధించగా, యూనివర్సిటీ విభాగంలో 89వ స్థానం పొందింది. హైదరాబాద్‌లోని నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా మూడవ ఉత్తమ యూనివర్సిటీగా నిలిచింది.
ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వ్యవసాయ సంబంధిత రంగాల సంస్థలలో గత సంవత్సరం 37వ స్థానం నుంచి ఈ ఏడాది 24వ స్థానానికి మెరుగైంది. దేశంలోని అత్యుత్తమ వైద్య విద్యా సంస్థలలో ఎయిమ్స్, ఢిల్లీ మొదటి ర్యాంకును సాధించింది. ఇన్నోవేషన్ క్యాటగిరీలో మొదటి ర్యాంకు ఐఐటీ, మద్రాసుకు లభించగా ఐఐటీ, హైదరాబాద్ 6వ స్థానంలో నిలిచింది.టాప్ 10 మేనేజ్మెంట్ కాలేజీలలో మొదటి ర్యాంకు ఐఐఎం అహ్మదాబాద్ దక్కించుకుంది. ఫార్మసీలో హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్ 5వ ర్యాంకులో నిలిచింది.
విజ్ఞాన్ వర్సిటీ ఓవరాల్ ర్యాంకింగ్స్‌లో 70వ ర్యాంక్, ఇంజనీరింగ్ విభాగంలో 80వ ర్యాంకు సొంతం చేసుకున్నది. వర్సిటీ వీసీ ప్రొ.పీ.నాగభూషణ్ మాట్లాడుతూ ఈ ర్యాంకుల ద్వారా విద్యార్థులకు ఎంఎన్సీ లలో ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయన్నారు. అత్యుత్తమ ర్యాంకులకు ఫ్యాకల్టీ, విద్యార్థుల సహకారమే కారణమన్నారు.