న్యూఢిల్లీ : ధర్నాలు, భారీ జన సమూహాలను దృష్టిలో ఉంచుకొని కేంద్ర హోం శాఖ వాటి నియంత్రణకు కొత్త మార్గ దర్శకాలను సిద్ధం చేసింది. కుంభ మేళా, క్రీడల స్టేడియాలు, మత కార్యక్రమాలు, ఆధ్యాత్మిక నేతల ప్రసంగాలకు ఈ మార్గ దర్శకాలు వర్తిస్తాయి. మత పరమైన అల్లర్లు, విద్యార్థుల ఉద్యమాలు, సామాజిక మాధ్యమ ప్రేరిత ప్రజాందోళనలకూ ఇవే వర్తించనున్నాయి. కార్మికుల ర్యాలీలకు ప్రత్యేక ఏర్పాట్లను ప్రతిపాదించారు.
జన సమూహాన్ని అరికట్టడానికి: విధ్వంస గ్రూపును చిన్న లేదా పరిమిత స్థలంలో వేరుగా ఉంచడానికి పరిమిత ప్రాంతంలో వారిని బంధించడానికి భవనాలు, దారులను ఉపయోగించాలి. ఎల్లప్పుడూ సురక్షిత నిష్క్రమణ మార్గాన్ని ఏర్పాటు చేయాలి. జన సమూహాన్ని చెదరగొట్టేందుకు: గోడలాగా ఉండే ఒకటి లేదా రెండు పోలీస్ లైన్లను ఏర్పాటు చేయాలి. ఒక ప్రదేశానికి వెళ్లే జన సమూహాన్ని దిగ్బంధం చేయడానికి, ఆ సమూహాన్ని నెమ్మదిగా వెనక్కు నెట్టడానికి ఈ పద్ధతిని పాటించాలి. ఇందుకోసం రక్షణ షీల్డ్లు, అవసరమైతే బారికేడ్లను ఉపయోగించాలి. జన సమూహాన్ని ఆపడానికి: పోలీసులు ‘V’ ఆకారంలో ఏర్పడాలి. దారి(ఉదాహరణకు అంబులెన్స్ కోసం) ఏర్పాటుకు జన సమూహాన్ని రెండు భాగాలుగా విడదీయాలి.