న్యూఢిల్లీ, జూలై 14: పాఠ్య పుస్తకాల్లో చరిత్ర తారుమారు చేయడం, హిందీ రుద్దడం అయిపోయాయి. ఇప్పుడు బడిపిల్లల నోటికాడి ముద్ద మీద కన్నేసింది మోదీ సర్కారు. జాతీయ విద్యావిధానం రూపకల్పన పేరిట జరుగుతున్న తతంగం చూస్తుంటే మధ్యాహ్న భోజనం మిథ్యాన్న భోజనంగా మారే పరిస్థితులు కనిపిస్తున్నాయి. విద్యార్థులకు వడ్డించాల్సిన పోషకాహారంపై మోదీ సర్కారు ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ రూపొందించిన పత్రం తప్పుల తడకగా ఉండటమే కాకుండా అసలుకే ఎసరు పెట్టేలా ఉంది. ఇటీవల వెలుగు చూసిన ఆ పత్రంలో ఆసక్తికరమైన అంశాలు చాలానే ఉన్నాయి. గుడ్లు, మాంసం పిల్లల మెనూ నుంచి తొలగించాలని నిపుణుల కమిటీ సూటిగానే సూచించింది. మెనూ మార్చడమే కాకుండా పిల్లలకు అశాస్త్రీయమైన భోజన విధానాలపై పాఠ్యాంశాలు కూడా రూపొందించాలని సిఫార్సు చేశారు.
ఎనిమిది మంది నిపుణుల్లో స్కూలు టీచరు గానీ, తల్లిదండ్రుల ప్రతినిధులు గానీ లేకపోవడం గమనార్హం. ‘మధ్యాహ్న భోజన ప్రణాళిక సిద్ధం చేసేటప్పుడు అందులో కొలెస్టరాల్ లేకుండా చూడాలి. గుడ్ల వంటివి కలపడం మానుకోవాలి. రుచికరమైన పదార్థాలు కలిపిన పాలు, బిస్కట్లు లేకుండా చూడాలి. అధిక కెలోరీలు, కొవ్వు వల్ల ఊబకాయం, హార్మోన్ అసమతూకం రాకుండా చూసేందుకు వీటన్నిటినీ నివారించాలి. గుడ్లు, మాంసం తరచుగా తినడం వల్ల లభించే కొలెస్టరాల్ మధుమేహం, ముందస్తు రుతుస్రావం, పిల్లలు కలగకపోవడం వంటి జీవన విధాన జాడ్యాలకు కారణమవుతుంది. మాంసం వల్ల హార్మోనల్ అసమతౌల్యం ఏర్పడుతుందని చాలా దేశాల్లో జరిపిన అధ్యయనాల్లో రుజువైంది’ అని పత్రంలో ఒకచోట రాసిఉన్నది.
ఈ ఆణిముత్యాలు హిందూత్వ భావజాలం నుంచి పుట్టుకువచ్చినవని చెప్పకనే తెలుస్తుంది. పిల్లలకు భోజనంలో గుడ్లు, మాంసం చేర్చింది పోషకాహార లోపం సరిదిద్దడానికే. ఈ వైఖరి పత్రాన్ని వండివార్చిన పండితులు వాటిని తీసేయాలని అంటున్నారు. గుడ్లు, మాంసం నుంచి మాంసకృత్తులు మాత్రమే కాకుండా బీ-12, ఐరన్ వంటివి కూడా లభిస్తాయి. అధిక సంఖ్యాకుల ఆహారపు అలవాట్లను అవమానించడం, కొద్దిమంది తీసుకునే భోజనాన్ని ‘భారతీయమైనది’ అని చెప్పడం పత్రాన్ని రూపొందించిన అష్టదిగ్గజాలకే చెల్లింది. పైగా సహజ ఎంపిక, జాతీయత వంటి తలాతోకా లేని పెద్దపెద్ద మాటలను జోడించడం వింత. తమ సిఫార్సులకు ఆధారాలు చూపలేని నిపుణులు ఆయుర్వేదం కింద తలదాచుకోవాలని చూశారు. కానీ చరకుడు రాసిన చరకసంహిత ఎన్నిరకాల మాంసాలున్నాయో, వాటి లక్షణాలు ఏమిటో సవివరంగా తెలియజేస్తుంది. భారత ఉపఖండ ప్రజలు వేల సంవత్సరాలుగా మాంసం తింటున్నారు. సింధులోయ నాగరిత అవశేషాల్లో నాటి మాంసాహార అలవాట్ల ఆనవాళ్లు లభించాయి. పిల్లల ఆరోగ్యం, సంక్షేమం కన్నా ఏ ఆహారం భారతీయత కిందకు వస్తుందో చెప్పేందుకు నిపుణులు ప్రాముఖ్యం ఇవ్వడం గమనార్హం.