Cough Syrup | దగ్గు మందు కారణంగా మధ్యప్రదేశ్‌లోని చింద్వారా జిల్లాలో 11 మంది చిన్నారులు మరణించడం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ నేపథ్యంలోనే దగ్గు మందు వినియోగంపై కేంద్ర ప్రభుత్వం కీలక సూచనలు చేసింది. రెండేళ్లలోపు చిన్నారులకు దగ్గుమందు వాడకూడదని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ (డీజీహెచ్ఎస్) హెచ్చరికలు జారీ చేసింది. రెండు నుంచి ఐదేళ్ల లోపు పిల్లలకు అత్యవసరమైతే పరిమితంగా మాత్రమే దగ్గు మందు వాడాలని సూచించింది.
మధ్యప్రదేశ్ చింద్వారా జిల్లాలో సెప్టెంబర్ 7వ తేదీ నుంచి 20 వ తేదీ మధ్య దాదాపు 15 రోజుల్లో కిడ్నీ వైఫల్యం కారణంగా 9 మంది మరణించారు. రాజస్థాన్‌లోని సికార్ జిల్లాలో కూడా ఇలాంటి మరణాలే నమోదయ్యాయి. అయితే వారిలో ఐదుగురు కోల్డ్రెఫ్( Coldref ), మరొకరు నెక్స్ట్రో సిరప్ (Nextro Syrup) తీసుకున్నట్లుగా అధికారులు గుర్తించారు. దీంతో కేంద్ర ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. ఈ dextromethorphan hydrobromide సిరప్‌లపై అత్యవసర పరిశోధనలు ప్రారంభించింది. నేషనల్ సెంటర్ ఫర్ డిసీస్ కంట్రోల్, ది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ, ది సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్, ఇతర ఏజెన్సీలు మధ్యప్రదేశ్‌లోని చింద్వారా జిల్లాలో పర్యటించాయి. చిన్నారుల మరణానికి ముందు వాడిన దగ్గు మందు శాంపిళ్లను పరిశీలించింది. ఆయా దగ్గు మందులు కలుషితం కాలేదని తేల్చాయి. అలాగే వాటిలో హానికారకమైన డైఎథిలీన్ గ్లైకాల్ (DEG), ఎథిలీన్ గ్లైకాల్ (EG) వంటి కిడ్నీలకు హాని కలిగించే రసాయనాలు లేవని తేల్చింది.
ఈ నేపథ్యంలోనే చిన్నారులకు దగ్గు మందును పరిమితంగా వాడాలని డీజీహెచ్‌ఏ ఆదేశాలు జారీ చేసింది. చిన్నారుల్లో దగ్గు మెడిసిన్ వాడకపోయినా వాటంతట అదే తగ్గతుందని తెలిపింది. సరిపడా నిద్రతో పాటు సరైన జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందని పేర్కొన్నారు.
దగ్గు మందు తీసుకోవడం వల్ల చిన్నారులు మరణించిన ఘటనపై మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. జలుబు, జ్వరంతో వచ్చే చిన్నారులకు సొంతంగా చికిత్స అందించకూడదని.. తమ వద్దకు వచ్చిన పేషెంట్లను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించాలని ఆదేశించింది. మరోవైపు dextromethorphan hydrobromide syrup బ్యాచ్‌ల పంపిణీని రాష్ట్రవ్యాప్తంగా నిలిపివేశారు.