చండీగఢ్: త్వరలో జరుగనున్న పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల సంసిద్ధతను ప్రధాన ఎన్నికల కమిషనర్ సుశీల్ చంద్ర సమీక్షించారు. ఇతర ఎన్నికల కమిషనర్లు, ఉన్నతస్థాయి అధికారులతో కలిసి పంజాబ్‌కు ఆయన బుధవారం వచ్చారు. చండీగఢ్‌లో గురువారం ఆ రాష్ట్రంలోని రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించారు. అనంతరం సుశీల్ చంద్ర మీడియాతో మాట్లాడారు. పంజాబ్‌లో మొత్తం ఎన్నికల సంసిద్ధతను ఎన్నికల సంఘం సమీక్షించిందని తెలిపారు. జిల్లా ఎన్నికల అధికారులు, డిప్యూటీ కమిషనర్లు, 23 జిల్లాల సీపీలు, ఎఎస్పీలతో అన్ని అంశాలను చర్చించినట్లు చెప్పారు.
షాడో ఏరియాల్లోకి వచ్చే సరిహద్దు జిల్లాలు మినహా అన్ని పోలింగ్ స్టేషన్లలో వెబ్‌కాస్టింగ్ ఏర్పాటు చేస్తామని అన్ని రాజకీయ పార్టీలకు సుశీల్ చంద్ర హామీ ఇచ్చారు. కోవిడ్ సామాజిక దూరం నిబంధనలను దృష్టిలో ఉంచుకుని ఒక పోలింగ్ స్టేషన్లో గరిష్ఠ ఓటర్ల సంఖ్యను 1500 నుంచి 1200కు తగ్గించినట్లు తెలిపారు. కనీసం 165 పోలింగ్ బూత్‌లను మహిళలు నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తామన్నారు.