న్యూఢిల్లీ, సెప్టెంబర్ 19 : దేశంలోని చిన్నాచితకా పార్టీలకు భారత ఎన్నికల సంఘం మరోసారి షాకిచ్చింది. గత ఆరేండ్లుగా ఎన్నికల్లో పోటీ చేయకపోవడం సహా, నిబంధనలు పాటించని, గుర్తింపు లేని, నమోదైన 474 పార్టీలను జాబితా నుంచి తొలగిస్తున్నట్టు శుక్రవారం ప్రకటించింది. కాగా, ఈసీ ఆగస్టు 9న మొదటి విడతగా చేపట్టిన ఈ కార్యక్రమంలో 334 నమోదై, గుర్తింపులేని పార్టీ (ఆర్‌యూపీపీ) లను తొలగించిన సంగతి తెలిసిందే.
దానికి కొనసాగింపుగా 474 పార్టీలను కూడా తాజాగా తొలగించామని, మొత్తం రెండు నెలల కాలంలో 808 ఆర్‌యూపీపీలను జాబితా నుంచి తీసివేశామని తెలిపింది. ఇప్పటివరకు దేశంలో 2,520 ఆర్‌యూపీపీలు ఉండగా, తాజా తొలగింపు తర్వాత వాటి సంఖ్య 2,046కు చేరుకుంది. ఇవికాక, ఆరు గుర్తింపు పొందిన జాతీయ పార్టీలు, 67 రాష్ట్ర పార్టీలు ఉన్నట్టు ఈసీ వివరించింది.