ముంబై, మే 07 : సాంప్రదాయ వైద్యంలో భారతదేశం గొప్ప వారసత్వాన్ని కాపాడే దిశగా ఆయుష్ మంత్రిత్వ శాఖ పరిధిలోని సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేద శాస్త్ర (CCRAS), రెండు అరుదైన ఆయుర్వేద మాన్యుస్క్రిప్ట్ (రాతప్రతులు) లను పునరుద్ధరించింది. అవి ద్రవ్యరత్నాకర నిఘంటు అలాగే ద్రవ్యనాకర నిఘంటు. ఈ మాన్యుస్క్రిప్ట్‌లను ప్రఖ్యాత మాన్యుస్క్రిప్టాలజిస్ట్, అనుభవజ్ఞుడైన ఆయుర్వేద నిపుణుడు, ముంబైకి చెందిన డాక్టర్ సదానంద్ డి.కామత్ అనువదించారు.
ముంబైలోని RRAP సెంట్రల్ ఆయుర్వేద పరిశోధనా సంస్థ బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో ఈ ప్రచురణలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి న్యూఢిల్లీలోని CCRAS డైరెక్టర్ జనరల్ ప్రొఫెసర్ వీడీ రబీనారాయణ్ ఆచార్య హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సాంప్రదాయ ఆయుర్వేద సాహిత్య పరిశోధన, డిజిటలైజేషన్, పునరుజ్జీవనంలో ‘CCRAS, ఆయుష్ మంత్రిత్వ శాఖ కార్యకలాపాలను వివరించారు.
ఈ సందర్భంగా ప్రొఫెసర్ వీడీ రబీనారాయణ్ ఆచార్య మాట్లాడుతూ.. భారతదేశ ప్రాచీన జ్ఞానాన్ని సమకాలీన పరిశోధన చట్రాలతో అనుసంధానించడంలో ఇటువంటి పునరుజ్జీవనాల ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. “ఈ గ్రంథాలు కేవలం చారిత్రక కళాఖండాలు కాదని.. సమకాలీన ఆరోగ్య సంరక్షణ విధానాలను మార్చగల సజీవ జ్ఞాన వ్యవస్థలు” అని ఆయన అన్నారు. ఈ కీలక సంచికలు విద్యార్థులు, పరిశోధకులు, విద్యావేత్తలు, ఆయుర్వేద అభ్యాసకులకు అమూల్యమైన వనరులుగా ఉపయోగపడతాయన్నారు.
క్రీ.శ. 1480లో ముద్గల పండిత రచించిన, గతంలో ప్రచురించని నిఘంటువులో ఔషధ పర్యాయపదాలు, చికిత్సా చర్యలు అలాగే ఔషధ లక్షణాలపై లోతైన జ్ఞానాన్ని అందించే పద్దెనిమిది అధ్యాయాలు ఉన్నాయి. 19వ శతాబ్దం వరకు మహారాష్ట్రలో విస్తృతంగా ప్రస్తావించబడిన గ్రంథం. ఇది ధన్వంతరి, రాజ నిఘంటు వంటి శాస్త్రీయ నిఘంటుల నుండి తీసుకోబడింది. అదే సమయంలో మొక్క, ఖనిజ, జంతు మూలాల నుండి అనేక ఔషధ పదార్థాలను డాక్యుమెంట్ చేస్తుంది. డాక్టర్ ఎస్.డి. కామత్ పునరుద్ధరించిన ఈ కీలక సంచిక ద్రవ్యగుణ అదేవిధంగా అనుబంధ ఆయుర్వేద విభాగాలకు ఒక స్మారక సహకారం.
భీష్మ వైద్యునికి ఆపాదించబడిన ఈ ప్రత్యేకమైన రచన ధన్వంతరి నిఘంటుకు ఒక స్వతంత్ర అనుబంధంగా పనిచేస్తుంది. ఆయుర్వేదానికి కీలకమైన సంక్లిష్ట అధ్యయన రంగమైన ఔషధ అలాగే మొక్కల పేర్ల హోమోనిమ్ (ఒకే విధంగా ఉండే పదాలు) లపై ప్రత్యేకంగా దృష్టి పెడుతుంది. 182 శ్లోకాలు, రెండు కోలోఫోన్ శ్లోకాలను కలిగి ఉన్న ఈ గ్రంథాన్ని డాక్టర్ కామత్ జాగ్రత్తగా సవరించి వ్యాఖ్యానించారు. రసశాస్త్రం, భైషజ్య కల్పన, శాస్త్రీయ ఆయుర్వేద ఔషధ శాస్త్ర పండితులకు దీని ప్రయోజనాన్ని మెరుగుపరిచారు.