న్యూఢిల్లీ, ఏప్రిల్ 3: సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ) తన కొత్త పాఠ్యప్రణాళికను శుక్రవారం విడుదల చేసింది. 2026-27 విద్యా సంవత్సరం నుంచి 6వ తరగతి నుంచి త్రిభాషా విధానాన్ని, 9వ తరగతికి గణితం, సైన్స్‌కు రెండు స్థాయిల విధానాన్ని దశలవారీగా అమలుచేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. భాషలను ఆర్1, ఆర్2, ఆర్3 అనే మూడు దశల వారీగా ఒక క్రమబద్ధమైన ఫ్రేమ్ వర్క్ ద్వారా నిర్వహిస్తారు. కొత్త జాతీయ పాఠ్యప్రణాళిక ఫ్రేమ్‌వర్క్(ఎన్సీఎఫ్) సిఫార్సుల ప్రకారం ఈ మూడు భాషల్లో రెండు భారతదేశానికి చెందినవై ఉండాలి.
బహుభాషా విద్యను బోర్డు దశల వారీగా అమలు చేయడంలో భాగంగా 2026-27 విద్యా సంవత్సరం నుంచి 6వ తరగతి నుంచే మూడవ భాషను తప్పనిసరి చేయడం జరుగుతుంది అని బోర్డు సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.
అదే భాషల విధానాన్ని అనుసరించడం వాంఛనీయమే అయినప్పటికీ విదేశీ పాఠశాలల నుంచి తిరిగి వచ్చే విద్యార్థులకు 8వ లేదా 9వ తరగతి వరకు అభ్యసించిన మూడవ భాష దేశీయ పాఠశాలల్లో అందుబాటులో లేని పక్షంలో అటువంటి అసాధారణ పరిస్థితుల్లో నిబంధనల ప్రకారం మినహాయింపు ఇవ్వవచ్చని ఆయన చెప్పారు. అయితే అటువంటి విద్యార్థులు నిర్దేశించిన మొత్తం సబ్జెకులను తప్పనిసరిగా చదవాల్సి ఉంటుందని ఆయన చెప్పారు. 2026-27 విద్యా సంవత్సరం నుంచి రెండు స్థాయిల విధానాన్ని ప్రవేశపెట్టడంతో గణితం, సైన్స్ సబ్జెక్టుల్లో ఓ ప్రధాన నిర్మాణాత్మక మార్పు రానున్నది.