హైదరాబాద్, మే 16 (నమస్తే తెలంగాణ): ఈ విద్యా సంవత్సరం నుంచి 9, 10 విద్యార్థులకు త్రి భాషా విధానాన్ని తప్పనిసరి చేస్తున్నట్టు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) ప్రకటించింది. 2026-27 విద్యా సంవత్సరం నుంచి భాషా విధానంలో ప్రధాన మార్పులు తెస్తున్నట్టు ఒక సర్క్యులర్లో పేర్కొన్నది. ఈ సవరించిన విధానం జాతీయ విద్యా విధానం 2020, ఎన్సీఎఫ్-ఎస్ఈకి అనుగుణంగా చేసినట్టు తెలిపింది.
మూడో భాషకు బోర్డు ఎగ్జామ్ ఉండదు. ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలన్నింటికీ ఇది వర్తిస్తుంది. సవరించిన విధానం ప్రకారం ఈ సంవత్సరం జూలై 1 నుంచి ప్రారంభమయ్యే విద్యా సంవత్సరంలో 9,10 విద్యార్థులు ఆర్1, ఆర్2, ఆర్3 భాషలు తప్పనిసరిగా ఉంటాయి. అందులో రెండు భారతీయ స్థానిక భాషలు తప్పనిసరి. విద్యార్థులు ఏదైనా విదేశీ భాషను అభ్యసించాలని కోరుకుంటే ఈ రెండు తప్పనిసరి భాషలు కాకుండా మూడో భాషగా దానిని చదవవచ్చు.
ఈ భాషలు బోధించే అర్హులైన ఉపాధ్యాయులు లభించని పాఠశాలలు రిటైర్డ్ టీచర్ల నియామకం, క్వాలిఫైడ్ పీజీల నియామకం వంటివి చేపట్టడం ద్వారా ఆ లోటును భర్తీ చేసుకోవచ్చునని తెలిపింది. కొత్త విధానం వల్ల మాతృభాష, జాతీయ, అంతర్జాతీయ భాషలపై పట్టు సాధించేందుకు అవకాశం కలుగుతుందని వెల్లడించింది.