న్యూఢిల్లీ, ఏప్రిల్ 8: ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఇండియా మాజీ చీఫ్ ఆకార్ పటేల్‌కు ఎదురుదెబ్బ తగిలింది. అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లొద్దని ఢిల్లీ సెషన్స్ కోర్టు శుక్రవారం ఆదేశించింది. దీంతో పాటుగా సీబీఐ ఆయనకు లిఖితపూర్వకంగా క్షమాపణలు చెప్పాలని స్పెషల్ కోర్టు గురువారం ఇచ్చిన ఆదేశాలను నిలిపివేసింది.
సీబీఐ సవాల్ పిటిషన్‌పై తదుపరి విచారణను ఈనెల 12కు వాయిదా వేసింది. స్పెషల్ కోర్టు ఆదేశాల నేపథ్యంలో గురువారం అమెరికాకు వెళ్లేందుకు బెంగళూరు ఎయిర్‌పోర్టుకు వెళ్లగా అధికారులు మళ్లీ అడ్డుకున్నారని ఆకార్ పటేల్ పేర్కొన్నారు. స్పెషల్ కోర్టు ఆదేశాలను ఉద్దేశపూర్వకంగా ఇమ్మిగ్రేషన్ అధికారులకు చేరవేయకుండా సీబీఐ అధికారి ఫోన్ స్విచ్చాఫ్ చేశారని ఆరోపించారు.