AAP MLA Bank Fraud | పంజాబ్‌లోని అధికార ఆమ్ఆద్మీ పార్టీ (ఆప్) ఎమ్మెల్యే మోసం (ఫ్రాడ్) ఆరోపణలు వస్తున్నాయి. బ్యాంక్ ఆఫ్ ఇండియాను రూ.40.92 కోట్లకు మోసగించాడన్న అభియోగంపై కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) అధికారులు శనివారం తనిఖీలు నిర్వహించారు. సంగ్రూర్‌లోని ఆప్ ఎమ్మెల్యే జశ్వంత్ సింగ్ గజ్జన్ మజ్రా నివాసంతోపాటు మూడు చోట్ల సోదాలు సాగాయి. బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫిర్యాదు మేరకు సీబీఐ అధికారులు కేసు నమోదు చేశారు. తాము జరిపిన సోదాల్లో వివిధ వ్యక్తులు సంతకాలు చేసిన 94 బ్లాంక్ చెక్‌లు, వారి ఆధార్ కార్డులను స్వాధీనం చేసుకున్నట్లు సీబీఐ వర్గాలను ఉటంకిస్తూ పీటీఐ ఓ వార్తా కథనం ప్రచురించింది. పలు బ్యాంకుల ఖాతాలు, కొన్ని ఆస్తుల పత్రాలతోపాటు రూ.16.57 లక్షల నగదు, 88 విదేశీ కరెన్సీ నోట్లు, ఇతర ఆధారాలతో కూడిన పత్రాలను స్వాధీనం చేసుకున్నామని సీబీఐ ప్రతినిధి ఆర్సీ జోషి చెప్పారు.
అమర్గడ్ ఎమ్మెల్యే జస్వంత్ సింగ్ గజ్జన్ మజ్రాకు వ్యతిరేకంగా బ్యాంక్ ఆఫ్ ఇండియా లుధియానా శాఖ ఫిర్యాదు మేరకు సీబీఐ కేసు నమోదు చేసింది. ఎమ్మెల్యేతోపాటు మాలెర్కోట్లలోని గౌన్స్పురాలో తారా కార్పొరేషన్ (మాలౌడ్ అగ్రో) పై కేసు నమోదైంది. ఈ సంస్థకు డైరెక్టర్లు, హామీదారులుగా ఉన్న కొందరు వ్యక్తులపైనా అభియోగాలు నమోదయ్యాయి. ఎమ్మెల్యే జస్వంత్ సింగ్ గజ్జన్ మజ్రా పేరు సంస్థ హామీ దారుగా, డైరెక్టర్‌గా పేర్కొన్నారు.
ఎమ్మెల్యే సోదరులు బల్వంత్ సింగ్, కుల్వంత్ సింగ్, మేనల్లుడు తేజిందర్ సింగ్‌లు సంస్థకు డైరెక్టర్లుగా, హామీ దారులుగా ఉన్నారు. వారిని నిందితులుగా చేర్చినట్లు సీబీఐ అధికారులు తెలిపారు. తారా హెల్త్ ఫుడ్స్ అనే సంస్థపైనా ఆరోపణలు ఉన్నాయి. తారా హెల్త్ ఫుడ్స్ సంస్థ పేరిట డీవోసీ రైస్ బ్రాన్, డీవోసీ మస్టర్డ్ కేక్, కాటన్ సీడ్ కేక్, మొక్కజొన్న, జొన్నలు తదితర ఆహార ధాన్యాల వ్యాపారం నిర్వహించారు.
తారా హెల్త్ ఫుడ్స్ 2011-14 మధ్య నాలుగు దఫాలుగా రుణం తీసుకున్నది. ఊహాజనిత స్టాక్‌లు చూపి నమ్మించారు. అటుపై తీసుకున్న రుణాన్ని ఉద్దేశపూర్వకంగా దారి మళ్లించారు. రుణ గ్రహీత నుంచి రుణ వసూళ్ల కోసం వెళ్లిన తనిఖీ అధికారికి సంబంధిత వ్యక్తులు అందుబాటులో లేకుండా పోయారని సీబీఐ తెలిపింది. 2014 మార్చి 31న ఈ ఖాతాను బ్యాంక్ ఆఫ్ ఇండియా మొండి బకాయిగా ప్రకటించింది. 2018 ఫిబ్రవరి 9వ తేదీన మోసం ( fraud ) అని ప్రకటించింది.