లూధియానా, ఫిబ్రవరి 21: ఇప్పటి వరకు ప్రతిపక్ష పార్టీల నేతలపై కేంద్ర దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పుతున్న కేంద్ర ప్రభుత్వం.. తాజాగా రైతు నేతలను లక్ష్యంగా చేసుకున్నది. పంజాబ్లోని ఇద్దరు రైతు నేతల ఇండ్లలో సీబీఐ అధికారులు మంగళవారం సోదాలు నిర్వహించారు. లూధియానాలోని బీకేయూ(లఖోవాల్) ప్రధాన కార్యదర్శి హరీందర్ సింగ్ లఖోవాల్ నివాసం, పటియాలాలోని ఇండియన్ ఫార్మర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సత్నాం సింగ్ బెహ్రు ఇండ్లలో తనిఖీలు నిర్వహించారు. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎఫ్సీఐ)లో చోటుచేసుకొన్న ఆహార ధాన్యాల కొనుగోలు స్కామ్ కేసులో భాగంగా సోదాలు చేపట్టినట్టు సీబీఐ వర్గాలు వెల్లడించాయి. కాగా, రైతు నేతల ఇండ్లలో సీబీఐ సోదాలను సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్కేఎం) తీవ్రంగా ఖండించింది. రైతుల్లో ఐక్యతను దెబ్బతీసేందుకు కేంద్ర ప్రభుత్వం కావాలనే రైతు నేతలను టార్గెట్ చేసుకొన్నదని, అయితే ఇటువంటి బెదిరింపులకు భయపడేది లేదని, మరింత దూకుడుగా పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేసింది. ఎఫ్సీఐ అధికారులు వ్యాపారుల నుంచి లంచాలు తీసుకొని నాసిరకం ధాన్యాన్ని కొనుగోలు చేశారనే ఆరోపణలపై సీబీఐ గత నెలలో కేసు నమోదు చేసింది.
హరీందర్ సింగ్ నివాసంలో మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు సీబీఐ అధికారులు సోదాలు నిర్వహించారు. పలు పత్రాలను స్వాధీనం చేసుకొన్నట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. హరీందర్ సింగ్ తండ్రి అజ్మీర్ సింగ్ లఖోవాల్ బీకేయూ(లఖోవాల్)ను స్థాపించారు. లూధియానా జిల్లాలో సామ్రాలాలోని అజ్మీర్ సింగ్కు చెందిన పెట్రోల్ బంక్, లఖోవాల్ గ్రామంలోని ఆయన పూర్వీకుల ఇండ్లుతో పాటు హరీందర్ సింగ్ నివాసంలో సీబీఐ సోదాలు నిర్వహించిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే సోదాల సమయంలో హరీందర్ సింగ్ ఇంటిలో లేరని పేర్కొన్నాయి. రైతుల హక్కుల కోసం పోరాడుతూనే ఉంటానని, ఇటువంటి చర్యల ద్వారా భయపెట్టలేరని హరీందర్ సింగ్ స్పష్టం చేశారు.
బీకేయూ(లఖోవాల్), ఇండియన్ ఫార్మర్స్ అసోసియేషన్ ఎస్కేఎంలో క్రియాశీల రైతు సంఘాలుగా ఉన్నాయి. సీబీఐ సోదాలపై ఎస్కేఎం నేత దర్శన్పాల్ మాట్లాడుతూ.. హరీందర్ సింగ్, బెహ్రు ఇద్దరూ చిన్న రైతులని పేర్కొన్నారు. ఏ లెక్కన వీరిద్దరిని సీబీఐ టార్గెట్గా చేసుకొన్నదని ప్రశ్నించారు. ఈ సోదాలను ఎస్కేఎం తీవ్రంగా ఖండిస్తున్నదని చెప్పారు. రైతాంగం పెండింగ్ డిమాండ్లపై మార్చి 20న పార్లమెంట్ వద్ద జరిగే ఆందోళనలో ఈ అంశాన్ని కూడా లేవనెత్తుతామని, కేంద్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే ఎస్కేఎం నేతలను టార్గెట్ చేస్తున్నదని మండిపడ్డారు.
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఎస్కేఎం ఆధ్వర్యంలో రైతులు ఢిల్లీ సరిహద్దులో పెద్ద ఎత్తున ఉద్యమించిన విషయం తెలిసిందే. ఈ ఉద్యమానికి జడిసి కేంద్రం ఆ చట్టాలను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. స్వయంగా ప్రధాని మోదీ జాతికి క్షమాపణలు చెప్పారు. అయితే ఉద్యమం విరమణ సందర్భంగా ఇచ్చిన హామీలను ఇప్పటికీ నెరవేర్చలేదని రైతులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. మరోసారి ఉద్యమానికి సిద్ధమవుతున్నారు. మార్చిలో పార్లమెంట్ వద్ద నిరసన చేపట్టనున్నట్టు ఇప్పటికే ప్రకటించారు.