CBSE | న్యూఢిల్లీ: అధిక చక్కెర వినియోగాన్ని తగ్గించడంపై విద్యార్థుల్లో అవగాహన పెంచేందుకు బడుల్లో చక్కెర (షుగర్) బోర్డులు ఏర్పాటు చేయాలని సీబీఎస్ఈ తన అనుబంధ పాఠశాలలను కోరింది. ఇటీవల కాలంలో పిల్లల్లో సైతం టైప్ 2 మధుమేహం పెరుగుతున్న నేపథ్యంలో ఈ చర్యను చేపట్టింది. చక్కెర అధికంగా తినడం వల్ల వచ్చే అనారోగ్య సమస్యలపై తన అనుబంధ స్కూళ్లకు రాసిన లేఖలో ఆందోళన వ్యక్తం చేసింది.
పంచదార కలిగిన చిరు తిండ్లు, పానీయాలు, ప్యాక్ చేసిన ఆహారం స్కూళ్ల ప్రాంగణాల్లో సులువుగా దొరకడం వల్లే బాలబాలికల్లో మధుమేహం కేసులు పెరుగుతున్నాయని తెలిపింది. దీని వల్ల ఊబకాయం, దంత సమస్యలు, ఇతర ఆరోగ్య సమస్యలనూ వారు ఎదుర్కొంటున్నారని చెప్పింది. బడుల్లో ఏర్పాటు చేసే షుగర్ బోర్డుల్లో రోజువారీ తీసుకోవాల్సిన పంచదార పరిమితి, జంక్ ఫుడ్, సాఫ్ట్ డ్రింక్స్ల్లో ఉండే చక్కెర స్థాయిలు, చక్కెర వల్ల కలిగే ఆరోగ్య సమస్యలను ప్రదర్శించాలని పేర్కొంది.